ముందస్తుకు వెళదాం,మూటా ముల్లె సర్దుకోండని ప్రధాని మోదీ వత్తిడి తీసుకువస్తే, ముఖ్యమంత్రి, పార్టీ ఇరుకున పడటం ఖాయమని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.
ముందస్తు ఎన్నికల మీద ముఖమంత్రి చంద్రబాబు నాయుడు అంత సుముఖంగా లేరని,నిజానికి, ప్రధాని నరేంద్ర మోదీ ముందస్తు ఎన్నికలంటారేమో ననే ఆందోళన కూడా ఆయన లో ఉందని టిడిపి వర్గాలంటున్నాయి.
కొద్ది రోజులుగా ముందస్తు ఎన్నికల చర్చ రాష్ట్రంలో సాగుతూ ఉంది.యుపి ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రధాని ముందస్తు ఎన్నికలకు వెళతారని, అపుడు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సై అంటాయని వార్తలు వెలువడ్డాయి.
ఇపుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచన లో మార్పు వచ్చినట్లు కనిపిస్తున్నదని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.ఆయన చేయించుకుంటున్న సర్వేలు ముందస్తు ఎన్నికలకు అనుకూలంగా లేవట.
అంతేకాదు, 2018 నాటికి పోలవరం పూర్తి చేయడం,అమరావతిని వర్ ల్డ్ క్లాస్ గా ప్రపంచానికి చూపించడం, ఇది బాబు సత్తా అని చెప్పుకోవాలన్నది ఆయన ఆశ. ఈ రెండింటిని పూర్తిచేసి ‘బాబు వస్తే ప్రాజక్టులు పూర్తవుతాయి’ అని ఒక కార్యసాధకుడిగా ఎన్నికలకు వెళ్లాలన్నది బాబు ధ్యేయం. అయితే, ఇప్పటికి ఒక్క ప్రాజక్టు కూడా పూర్తి కావడం లేదు.పూర్తవుతాయన్న నమ్మకమూ లేదు. అందవల్ల ఎన్ డి ఎ అనుబంధం ఉందన్నధీమాతో మోదీ తో పాటు ముందస్తు ఎన్నికలకు పోతే, మునుగుతామేమో అనే ఆలోచన పార్టీలో చాలా మందిలో ఉందట.
ఈ విషయం మీద ప్రత్యేకంగా చర్చంటు ఏమీ జరగకపోయినా, మీడియాలో వస్తున్న ముందస్తు ప్రచారం ప్రభావం నాయకత్వంలో కనిపిస్తూ ఉందని, పార్టీ ఎమ్మెల్యేలు కూడా దీనికి సుముఖంగా లేరని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.
ముందస్తుకు వెళదాం,మూటా ముల్లె సర్దుకోండిక అని మోదీ వత్తిడి తీసుకువస్తే, తెలుగుదేశం పార్టీ ఇరుకున పడతుందని ఈ వర్గాలు చెప్పాయి. ఇపుడే వారసుడు మంత్రయ్యాడు, రాష్ట్రమంతా తిరిగి, ఆయన జనామోదం పొందాల్సి వుంది. ముందుస్తు ఎన్నికలు బెడిసి కొడితే, వాటి ప్రభావం చిన్న బాబు భవిష్యత్తు మీద కూడా పడుతుందని, ఆయన మంత్రిగా నిలదొక్కుకునేందుకు ఈ రెండేళ్ల కాలం బాగా వినియోగించుకోవాలే తప్ప దుస్సాహసాలకు పోరాదని వారు భావిస్తున్నారు.
అందువల్ల ముందస్తు ఎన్నికల కు వెళ్లకపోవడమే మంచిదని తెలుగుదేశంలో బాగా బలంగా ఉందట.
ముఖ్యమంత్రి ఈ విషయం శాసన సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తే, చాలా మంది 2019 ఎన్నికలవైపూ మొగ్గు చూపుతారని, ముందస్తు వద్దని గట్టిగా చెప్పే అవకాశం ఉందని ఈ వర్గాలంటున్నాయి. గతంలో ఒక దఫా తొందరపడి ముందస్తు ఎన్నికలకు వెళ్లి చంద్రబాబు దెబ్బతిన్నారని , ఇది ఆయనకు బాగా గుర్తుందని టిడిపి నేతలంటున్నారు.
బీజేపీ ముందస్తు దూకుడు ఉన్న విషయం చంద్రబాబుకు తెలుసని అదే ఆయన ఆందోళనకు కారణమని వారు చెబుతున్నారు.
