అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి మాజీ పీఎ శ్రీనివాస్ పై ఐటి దాడుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రాజకీయంగా ఊరట లభించినట్లే. అమరావతి వివాదాన్ని తెర మీదికి తెచ్చి జగన్ ను చిక్కుల్లో పడేయడానికి చంద్రబాబు భారీ వ్యూహాన్నే రచించారు. అమరావతి రైతుల ఆందోళనకు మద్దతిస్తూ జగన్ ను ముందుకు కదలనీయకుండా చేశారని చెప్పవచ్చు.

అమరావతి విషయంలో చంద్రబాబు మునుపటిలా వ్యవహరించే అవకాశం లేకుండా పోయింది. ఐటి దాడుల నేపథ్యంలో చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు, మంత్రులు మూకుమ్మడిగా దుమ్మెత్తిపోస్తూ చంద్రబాబును ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీనివాస్ నివాసంలో జరిగిన సోదాల్లో చంద్రబాబుకు సంబంధించిన పత్రాలు ఏమైనా దొరికాయో లేదో గానీ వైసీపీ మాత్రం ఆయనకు అంటగడుతూ మరో అంశానికి అవకాశం లేకుండా చేస్తోంది. 

Also Read: చంద్రబాబుకు చిక్కులు: వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన సీక్రెట్ ఇదే...?

బహుశా, తొలిసారి చంద్రబాబుకు వైసీపీ ఎజెండాను ఇచ్చింది. టీడీపీ నేతలు చేసే విమర్శలకు జవాబులు ఇస్తూ వచ్చిన వైసీపీ నేతలు ఇప్పుడు తాము చంద్రబాబుపై, టీడీపీ నేతలపై విరుచుకుపడుతూ సమాధానాలు చెప్పే పరిస్థితికి వారిని నెట్టింది. వైసీపీ చేస్తున్న విమర్శలకు, ఆరోపణలకు టీడీపీ నేతలు సమాధానం చెప్పడంలో మునిగిపోతున్నారు. 

అమరావతి రైతుల ఆందోళన విషయంలోనే కాకుండా పాలనా వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో అడ్డుకోవడం, తద్వారా తలెత్తిన సెలెక్ట్ కమిటీ వివాదాన్ని వెనక్కి నెట్టడం తాజా పరిణామాల నేపథ్యంలో జరుగుతోంది. జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు చేస్తున్న పోరాటంలో పదును తగ్గే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. 

చంద్రబాబు విజయవాడలోనే మకాం వేస్తూ జగన్ ప్రభుత్వంపై దాదాపుగా ప్రతి రోజూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఆత్మరక్షణలో పడి ప్రభుత్వంపై విరుచుకుపడే పరిస్థితి లేదని అనిపిస్తోంది. దానికితోడు, చంద్రబాబు హుటాహుటిన హైదరాబాదు చేరుకున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 

పరిస్థితులను చక్కదిద్దుకునే పనిలో ఆయన పడినట్లు చెబుతున్నారు. ఇందులో వాస్తవం ఏమైనప్పటికీ వైసీపీ మాత్రం తన ఆరోపణలతో చంద్రబాబుకు ఊపిరి సలపకుండా చేస్తోందని చెప్పవచ్చు. ఈ స్థితిలో రాజధానుల మార్పు, తదితర విషయాలను జగన్ చక్కబెట్టుకునే వెసులుబాటు మాత్రం చిక్కిందని భావించవచ్చు. 

Also Read: అమ్మ చంద్రబాబు.. : ఐటీ దాడులపై బొత్స వ్యాఖ్యలు

జగన్ కు అమరావతి రైతుల ఆందోళన పెద్ద తలనొప్పిగానే ఉంటూ వచ్చిందని చెప్పవచ్చు. ఆందోళనలకు సంబంధించిన శిబిరాలను తొలగిస్తూ, దీక్షలను భగ్నం చేస్తూ జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ఓ దీక్షా శిబిరాన్ని తొలగించి, దీక్షను భగ్నం చేశారు. దీక్ష చేస్తున్నవారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయంలో చంద్రబాబు ఇంతకు ముందులా దూకుడు ప్రదర్శించే అవకాశం లేదని అంటున్నారు. 

కేవలం చంద్రబాబు మాజీ పీఎ నివాసంలోనే కాకుండా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి నివాసంలోనూ కార్యాలయంలోనూ సోదాలు జరిగాయి. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సన్నిహితులైనవారి కంపెనీలపై ఐటి దాడులు జరిగాయి. అమరాతి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐదీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై కేసులు నమోదయ్యాయి. 

Also Read: రావాలి జగన్, కావాలి జగన్ అని జైలు పిలుస్తోంది: నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు

టీడీపీ నేతలపై అవకాశం ఉన్న ప్రతి చోటా వివిధ ఆరోపణలపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తద్వారా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన టీడీపీ నాయకులు గొంతెత్తే పరిస్థితి లేకుండా పోతోంది. వారికి చంద్రబాబు తన మద్దతును ప్రకటించే అవకాశం కూడా లేకుండా పోతోంది. ఏమైనా, చంద్రబాబును ఆత్మరక్షణలో పడేసి జగన్ తన పని తాను చేసుకునే వెసులుబాటును మాత్రం కల్పించుకున్నారని చెప్పవచ్చు.