దర్శకునిపై చంద్రబాబు కక్ష కట్టారా ?

దర్శకునిపై చంద్రబాబు కక్ష కట్టారా ?

చంద్రబాబునాయుడును నంది అవార్డుల వివాదాలు ముసురుకుంటున్నాయి.  ప్రభుత్వం ఎప్పుడు అవార్డులు ప్రకటించినా వివాదాలు సహజమే. కాకపోతే, ఆ వివాదాలు అవార్డులను ప్రకటించిన జ్యూరీ-సినిమా యూనిట్ వరకే పరిమితమయ్యేవి. తాజా వివాదాలన్నింటికీ చంద్రబాబు కేంద్ర బిందువయ్యారు. బాలకృష్ణ నటించిన లెజెండ్ ఉత్తమ సినిమాగా ఎంపికవ్వటంతో పాటు ఉత్తమ నటునిగా (లెజెండ్) బాలకృష్ణను ఎంపిక చేసిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు-బాలకృష్ణ బావ, బావమరుదులే కాకుండా వియ్యంకులు కూడా కావటంతో లెజెండ్ సినిమాకు అవార్డుల పంట పండినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. లెజెండ్ కన్నా మంచి సినిమాలున్నా వాటిని పక్కన పడేసారని ఆరోపణలు వినిపిస్తుండటం మరో కారణం.

తాజాగా దర్శకుడు గుణశేఖర్ కూడా చంద్రబాబునే లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఓ టివి చర్చలో భాగంగా గుణశేఖర్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ మొదలైంది. దర్శకుడు ఒకవైపు చంద్రబాబును పొగుడుతూనే మరోవైపు నంది అవార్డుల నిర్ణయాలను  ఆక్షేపిస్తుండటం గమనార్హం. తనపై కక్షగట్టి తనకు అవార్డులు రాకుండా చేసేంత తీరిక చంద్రబాబుకు ఉంటుందని అనుకోవటం లేదనే అనుమాన బీజాన్ని నాటారు.

తన సినిమా రుద్రమదేవికి అవార్డులు రాకపోవటానికి ఏదో బలమైన కారణాలే ఉండి ఉంటాయంటూ అందరిలోనూ అనుమానాలను రేకెత్తించారు. తనపై కక్షకట్టేంత మనిషి కూడా చంద్రబాబు కాదంటున్నారు. విమర్శలు ఎప్పుడూ ఉండేవే కానీ కొన్ని సార్లు లోపాలు కొట్టొచ్చినట్లు కనబడతాయని  ఎత్తి పొడిచారు. బహుశా మూడు సంవత్సరాల నంది అవార్డులను ఒకేసారి ప్రకటిచటం వల్లే ఇలా జరిగిందేమో అని గుణశేఖర్ అభిప్రాయపడ్డారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos