చంద్రబాబు నాలుగేళ్ల పాలన: కేంద్రం భుజాలపై తుపాకి పెట్టి...

చంద్రబాబు నాలుగేళ్ల పాలన: కేంద్రం భుజాలపై తుపాకి పెట్టి...

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఓ మాటన్నారు. గత నాలుగేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ కాస్తా కుదుటపడిందని, పూర్తి స్థాయిలో తేరుకోవాలంటే మరో ఆరేళ్లు పడుతుందని ఆయన అన్నారు. ఆ ఆరేళ్లు దేనికి గీటురాయి అని ఆలోచిస్తే ఓ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది.

రేపటితో అంటే జూన్ 8వ తేదీకి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి పదవీ బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతుంది. ఆయన పదవీ కాలం మరో ఏడాది పాటు ఉంది. ఇంకా ఐదేళ్లు రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబుకు అవసరం. అంటే మరోసారి ఎన్నికల్లో గెలిపించాలని ఆయన ప్రజలను పరోక్షంగా కోరినట్లు అనుకోవాలి.

నాలుగేళ్ల పాలనలో ఆయన సాధించిందేమిటి, సాధించనది ఏమిటి అని బేరీజు వేసుకుంటే, చాలా వరకు అసంతృప్తి మాత్రమే మిగులుతుంది. ఆయన చెప్పే లెక్కల మాట ఎలా ఉన్నా ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు కాలేదు. అభివృద్ధికి ఆయన పట్టిసీమ ప్రాజెక్టును చూపిస్తున్నారు. అది తప్ప చూపించుకోవడానికి బహుశా ఆయనకు ఏమీ లేవు. 

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఆయన 2018ని గీటురాయిగా పెట్టుకున్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాన్ని వచ్చే ఎన్నికల్లోగా పూర్తి చేస్తానని చెప్పారు. కానీ ఈ రెండు కూడా పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. ఆ పూర్తి కాకపోవడానికి గల కారణంపై ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి పూర్తి చేయలేదని ఆయన నెపాన్ని కేంద్రంపై నెట్టదలుచుకున్నారు. ఆ రకంగా ప్రజల దృష్టిని ఆయన కేంద్రం వైపు మళ్లించాలనే వ్యూహం స్పష్టంగానే అర్థమవుతోంది.

స్థానికంగా వివిధ ప్రాంతాలకు ఇచ్చిన హామీలు గానీ, వివిధ వర్గాలకు చేసిన వాగ్దానాలు గానీ పూర్తి స్థాయిలో అమలైన సూచనలు లేవు. కాపు రిజర్వేషన్ల విషయంలో ఆయన అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకున్నారు. చంద్రబాబు చర్య కాపు రిజర్వేషన్లు అమలులోకి వచ్చేందుకు కాదనేది స్పష్టంగానే తెలిసిపోతోంది.

ఇసుక మాఫియా విషయంలో ఆయన తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సరేసరి, ఆయనకు చంద్రబాబును ఎదుర్కోవడమే ముఖ్యం కాబట్టి విమర్శలు, ఆరోపణలు చేస్తారని అనుకోవచ్చు. కానీ, గత ఎన్నికల్లో మద్దతు తెలిపి, టీడీపీ విజయానికి తోడ్పడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనపై తీవ్రమైన ఆరోపణలే చేస్తున్నారు. వారు తనపై చేసిన విమర్శలను తిప్పికొట్టడానికి కూడా చంద్రబాబు రాజకీయ వ్యూహాన్నే అనుసరిస్తున్నారు. వారిద్దరు బిజెపి చేతులో పావులుగా మారారనేది ఆయన ప్రధానమైన ఆక్షేపణ. అది ఎంత వరకు చంద్రబాబుకు కలిసి వస్తుందనేది చెప్పలేం.

ఇసుక మాఫియా విషయంలో తాహిసిల్దార్ వనజాక్షి పట్ల శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ వ్యవహరించిన తీరులో చంద్రబాబు వ్యవహరించిన తీరు కూడా విమర్శల పాలవుతోంది. చింతమనేని ప్రభాకర్ ను ఆయన వెనకేసుకొచ్చినట్లు కనిపిస్తున్నారు. కాల్ మనీ వ్యవహారం చంద్రబాబును అప్పట్లో తీవ్రమైన చిక్కులకే గురి చేసింది. కాల్ మనీ బాధితుల సమస్యలు ఏమైనా తీరాయా అనేది ప్రశ్న. ఆ బాధితులు ఇప్పుడు ఎలా ఆలోచన చేస్తున్నారనేది కూడా ముఖ్యం.

అమరావతి విషయంలో మాత్రం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్ల తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామనే భావన వారిలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత గొప్ప నగరాన్ని నిర్మిస్తానని ఆయన చెబుతూ వస్తున్నారు. కానీ, ఇప్పుడు నిర్మాణాలు, తాత్కాలికమని చెబుతున్నప్పటికీ నాసిరకంగా ఉన్నాయనేది అనుభవంలో తేలిందే. 

ప్రత్యేక హోదా విషయంలో ఆయన చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేక హోదా ఇవ్వలేమని, దానికి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పినప్పుడు అంగీకారం తెలిపారు. ప్రత్యేక హోదాతో సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పినప్పుడు ఎందుకు కాదని అనాలని అంటూనే హోదా సంజీవిని ఏమీ కాదని అన్నారు. ఇప్పుడు దానికి కూడా కేంద్రాన్నే ఆయన నిందిస్తున్నారు.

కేంద్రం చేయాల్సినవేవీ చేయకపోవడం వల్ల, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడం వల్ల తాను ఎదురు తిరగాల్సి వచ్చిందని ఆయన చెబుతున్నారు. గత నాలుగేళ్లుగా బిజెపితో కలిసి పనిచేసి, అకస్మాత్తుగా ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకుని ప్రజలను నమ్మించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని దూషిస్తున్నారు. 

గత నాలుగేళ్ల కాలంలో ఆయన చేసిన పనుల వల్లనే పవన్ కల్యాణ్ ఆయనకు దూరమయ్యారనేది అందరికీ తెలిసిన విషయమే. అలాగే, బిజెపి ఒక రకంగా చంద్రబాబును ఎన్డీఎ నుంచి పొమ్మనలేక పొగపెట్టింది. ప్రధానంగా కేంద్రం ఇచ్చిన నిధులతో కార్యక్రమాలు చేపట్టి వాటిని రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకోవడం బిజెపికి నచ్చని విషయమని అర్థమవుతోంది. 

గత నాలుగేళ్ల కాలంలో తన వెంట ఉన్న మిత్రులను పోగొట్టుకుని చంద్రబాబు ఒంటరి పోరాటం చేయాల్సిన స్థితిలో పడ్డారు. ఆయన ప్రధానంగా మీడియా మీద ఆధారపడి వచ్చే ఎన్నికల్లో నెగ్గుకురావాలని చూస్తున్నట్లు కనిపిస్తున్నారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page