జగన్, పవన్ కల్యాణ్ లపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

Chandrababu fires at Pawan and Jagan
Highlights

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకరేమో కోర్టుకు వెళ్తారు, మరొకరేమో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తుంటారని ఆయన వారిద్దరిపై వ్యాఖ్యానించారు. లోకసభలో మోడీ ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 

ఎన్డీయేను జగన్, పవన్ కాపాడే ప్రయంత్నం చేస్తున్నారని విమర్శించారు.  ప్రధాని ప్రసంగాన్ని టీడీపీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. ఆ పార్టీలు ఎక్కడున్నాయని ఆయన వైసిపి, జనసేనలపై విరుచుకుపడ్డారు. ప్రజా సొమ్ము కాజేసి ఒకరు కోర్టుకెళ్లారని, మరొకరు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారని అన్నారు. ఈ ఇద్దరూ ఏపీ ప్రజల గౌరవాన్ని కేంద్రానికి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.

మోడీ హుందాతనం లేకుండా మాట్లాడారని, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తాను యూటర్న్‌ తీసుకున్నానని అంటున్నారని ఆయన అంటూ అసలెందుకు బీజేపీతో కలిశాం? ఎందుకు దాంతో విభేదించామని అన్నారు. ఆనాడు ఏపీ ప్రయోజనాల కోసమే కలిశామని, ఇప్పుడు కూడా రాష్ట్రం కోసమే విభేదించామని, మంత్రులతో రాజీనామా చేయించామని చెప్పారు.
 
నన్నేం చేయలేరనే అహంకారంతో ముందుకుపోతున్నారని, భూకంపం రాలేదేమని ఎగతాళి చేశారని, హామీల సాధన పోరాటంలో భాగంగా అన్ని ప్రయత్నాలూ చేసి.. చివరిగా అవిశ్వాసం పెట్టామని చెప్పారు.కేసీఆర్‌కు, తనకు గొడవలు ఉన్నాయని ప్రధాని ఇవాళ చెప్పారని, గొడవలు కాదు.. విభజన వల్ల అన్యాయం జరిగిందన్నామని ఆయన అన్నారు. 
 
తమ కేంద్ర మంత్రుల రాజీనామాలను ఆమోదించడానికి ముందు తనకు ప్రధాని ఫోన్‌ చేశారని, అయితే నిర్ణయం తీసుకున్నాం.. ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరానుని చంద్రబాబు చెప్పారు.  అవినీతి పార్టీని మోడీ పక్కన పెట్టుకుని.. ఆ పార్టీతో పోల్చుతూ రాష్ట్రానికి అన్యాయం చేయాలనుకోవడం చాలా దుర్మార్గమని అన్నారు. 
 
పవన్‌ కల్యాణ్‌ ట్వీట్లపై ట్వీట్లు చేస్తున్నారని, బీజేపీ, ఎన్డీఏకు కొంచెం కూడా నష్టం జరగకుండా వారిని కాపాడుతూ తమపై దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం ఇలాగేనా అని అడిగారు. దేశం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే.. సభలో ఎంపీ శివప్రసాద్‌ను నెట్టేశారని అన్నారు. ఈ రోజు వైసీపీ ఎక్కడుందని అడుగుతూ జగన్‌ కోర్టుకు పోయి ఇక్కడికొచ్చి పడుకొనే పరిస్థితి అని అన్నారు. 
 
హోదాపై కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే చెప్పిన దానిపై బీజేపీ మాజీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ హరిబాబు ఎందుకంత ఊగిపోయారో అర్థం కాలేదని అన్నారు.  ఎంపీగా హరిబాబుకు బాధ్యత లేదా అని అడిగారు. 

loader