ధర్మం తప్పారు, నాపైనే విమర్శలా: మోడీపై చంద్రబాబు ఫైర్

Chandrababu fires at Narendra modi
Highlights

లోకసభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోడీ ఇచ్చిన సమాధానంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు.

హైదరాబాద్: లోకసభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోడీ ఇచ్చిన సమాధానంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాత శుక్రవారం రాత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 

ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రధాని మోడీ మళ్లీ అదే నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆయన అన్నారు. ఇంతటి బాధ్యతారాహిత్యమైన కేంద్రాన్ని గతంలో తానెప్పుడూ చూడలేదని విమర్శించారు. మెజారిటీ ఉందనే ధీమాతో ప్రధాని మోడీ నీతి, ధర్మం తప్పారని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వ దుర్మార్గమైన వైఖరిని గమనిస్తే కాంగ్రెస్ ప్రభుత్వమే నయమనే అభిప్రాయం కలుగుతోందని ఆయన అన్నారు. 

ఏపీకి ప్రత్యేక హోదా కోసం చేసిన పోరాటంలో భాగంగా చివరి అస్త్రంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టామని అన్నారు. తెలుగు జాతికున్న దేశ భక్తిని మోడీ శంకించారని, ఇది ఆక్షేపణీయమని చంద్రబాబు అన్నారు. ఏపీకి హామీల విషయమై ప్రధాని మోడీ పాత విషయాన్నే మళ్లీ చెప్పారన్నారు. ఏపీ అభివృద్ధిపై ఏమాత్రం మాట్లాడలేదని అన్నారు.

రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. మోడీవి అహంకారపూరిత మాటలని మండిపడ్డారు. అధికారం ఉందని.. ఎవరూ ఏమీ చేయలేరనే అంహకారం మోడీని ఆవహించిందని అన్నారు. 

ఏపీకి న్యాయం చేయాలని అడిగితే తనపై రాజకీయ దాడి చేస్తున్నారని మండిపడ్డారు. నేడు మెజారిటీ-మొరాలిటీ మధ్య పొరాటం జరిగిందని అన్నారు.

loader