‘కర్ణాటకలో మేము చెప్పిందే తెలుగు ప్రజలు చేశారు’

‘కర్ణాటకలో మేము చెప్పిందే తెలుగు ప్రజలు చేశారు’

కర్ణాటకలో బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా, అనైతికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని మార్కెట్‌యార్డులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసి పూర్తి మెజార్టీ కలిగి ఉన్నాయని.. వారికి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు ఉందన్నారు.

కాగా..  అప్రజాస్వామ్యకంగా, రాజ్యాంగ విలువలను అతిక్రమించి  బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నించిందని దుయ్యబట్టారు.  రాజ్యాంగం ప్రకారం ప్రజలకు ఉన్న హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. ప్రత్యేక హోదా కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి దాన్ని తుంగలో తొక్కిన బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయకూడదని తాము కర్నాటకలోని తెలుగువారిని కోరినట్లు గుర్తుచేశారు.

 తమ పిలుపునకు కొంత మేర వారి నుంచి స్పందన వచ్చిందని, వారంతా బీజేపీకి ఓట్లు వేయలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.  ఆంధ్ర ప్రదేశ్‌కు న్యాయ, చట్టబద్ధంగా రావాల్సిన హక్కుల్ని కల్పించకుండా బీజేపీ తన స్వార్థ పూరిత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తోందని బాబు అన్నారు. కొన్ని పార్టీలు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి వ్యక్తుల్ని రెచ్చగొట్టి అరాచకాలకు ప్రేరేపిస్తున్నాయన్నారు. 

రాష్ట్రానికి హోదా సాధించడానికి ప్రజలంతా కేంద్రంపై పోరాడటానికి రావాలని పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా విపక్ష నేత జగన్‌పైనా చంద్రబాబు పరోక్షంగా నిప్పులు చెరిగారు. కేంద్రానికి సహకరించే వారిని రాష్ట్ర ద్రోహులుగా గుర్తించాలని జగన్‌కు చురకలు అంటించారు. ప్రస్తుతం రాష్ట్ర హక్కుల కోసం, న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం పోరాడాల్సిన వ్యక్తులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. 

తమపై ఉన్న కేసుల్ని మాఫీ చేయించుకోవడం కోసం బీజేపీతో చేతులు కలిపి నీతివంతమైన పాలన చేస్తున్న తనపై విమర్శలు చేయడం తగదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలకైనా వెనుకాడబోనని చంద్రబాబు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లును కైవసం చేసుకుని కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో మనమే కీలకం కావాలని చంద్రబాబు అన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos