మంత్రులపై చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకరు, ఇద్దరిని కాదు అందరినీ వరసబెట్టి వాయంచేశారు. ఇంతకీ మంత్రులపై చంద్రబాబుకు అంత కోపం ఎందుకొచ్చినట్లు? విషయం ఏమిటంటే, మంగళవారం రాత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీ నేతల సమన్వయ సమావేశం జరిగింది. ఆ సందర్భంగా పలువురు మంత్రులపై సిఎం మండిపడ్డారట.

చాలామంది మంత్రులు వివిధ జిల్లాలకు ఇన్చార్జి మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. అయితే, తాము ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న జిల్లాల్లో తమ వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకుంటూ మిగిలిన విషయాలను గాలికొదిలేస్తున్నారట. అంతేకాకుండా ఆ జిల్లాల్లోని ఎంఎల్ఏలు, ఎంపిలు తదితర నేతలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారట.పార్టీకి, ప్రభుత్వానికి మద్య సమన్వయం చేయలేకపోతున్నారట.

దానివల్ల ప్రతీ జిల్లాలోనూ పార్టీలో సమస్యలు పెరిగిపోతున్నాయట. 2019 ఎన్నికలేమో తరుముకొచ్చేస్తున్నాయ్. దాంతో పాటు నేతలమధ్య సమస్యలూ పెరిగిపోతున్నాయి. ప్రకాశం, విశాఖపట్నం, కర్నూలు, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాలే ఇందుకు పెద్ద ఉదాహరణ.

అంటే మిగిలిన జిల్లాల్లో నేతలేదో సఖ్యతగా ఉన్నారని కాదు. కాకపోతే పై జిల్లాల్లో మాత్రం స్వయంగా చంద్రబాబు సర్దుబాటు చేసినా గొడవలు ఆగటం లేదు. దానికితోడు ఇన్చార్జి మంత్రులు కూడా పట్టించుకోవటం లేదు. ఆ విషయం మీదే చంద్రబాబు మంత్రులపై మండిపడ్డారు. వర్గాలని, ఫిరాయింపులని చంద్రబాబే చేరదీసి గొడవలను పెంచి పోషించిన తర్వాత ఇన్చార్జి మంత్రుల మాట ఎవరింటారు?