కేంద్రప్రభుత్వంలో నుండి బయటకు రావటం తెలుగుదేశంపార్టీకి ఇష్టం లేదన్న విషయం స్పష్టమైపోయింది. పొత్తులు, రాజీనామాలపై మంత్రి ఆదినారాయణరెడ్డిపై చేసిన ప్రకటనపై చంద్రబాబునాయుడు దగ్గర నుండి మంత్రుల వరకూ మండి పడటంతోనే చంద్రబాబు ఆలోచనా విధానమేంటో అర్ధమైపోతోంది. ఇంతకీ మంత్రి ఏమన్నారు? టిడిపి 19 అంశాలను కేంద్రప్రభుత్వం ముందు ఉంచిందన్నారు. అందులో ఏ ఒక్క అంశాన్ని కేంద్రం అంగీకరించకపోయినా మార్చి 5వ తేదీనే తమ కేంద్రమంత్రులు మంత్రిపదవులకు రాజీనామాలు చేస్తారంటూ ప్రకటించారు. అదే సమయంలో బిజెపితో పొత్తు వదులుకుంటామని కూడా మీడియాతో చెప్పారు.

ఎప్పుడైతే ఆదినారాయణరెడ్డి ప్రకటన వెలుగు చూసిందో వెంటనే టిడిపిలో కలకలం రేగింది. చంద్రబాబు దగ్గర నుండి మంత్రులు, నేతలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మంత్రి ప్రకటనను ఖండించకపోతే రేపటి నుండి బిజెపి నుండి రాబోయే సమస్యలపై చర్చించుకున్నారు. అప్పటికప్పుడు మంత్రులతో ఆదినారాయణరెడ్డికి మాట్లాడించారు.

వెంటనే ఆదినారాయణరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి అంతకుముందు తాను మాట్లాడిందంతా తన వ్యక్తిగతమని చెప్పారు. తాను మంత్రి హోదాలో మాట్లాడలేదన్నారు. కేంద్రమంత్రులు రాజీనామాలు చేయటం, బిజెపితో పొత్తుల వ్యవహారం చంద్రబాబే చూసుకుంటారంటూ యూ టర్న్ తీసుకున్నారు. జరిగిన విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఏ స్ధాయిలో ఒత్తిడి తెచ్చారో అర్ధమైపోతోంది.

మంత్రివర్గంలోని వ్యక్తి ఏదైనా మాట్లాడితే మంత్రి హోదాలో మాట్లాడినట్లే అవుతుంది. అంతేకానీ మంత్రి హోదాలో ఒకమాట వ్యక్తిగత హోదాలో ఇంకోమాట ఉండదు. అయినా ఇక్కడ రెండు విషయాలు స్పష్టమయ్యాయి. ఒకటి: బిజెపితో ఇప్పటికిప్పుడు తెగతెంపులు చేసుకునే ఉద్దేశ్యం చంద్రబాబులో లేదన్నది. ఇక రెండో అంశం ఇప్పటికప్పుడు బిజెపితో పొత్తు వద్దనుకుంటే భవిష్యత్తులో తలెత్తబోయే సమస్యలకు చంద్రబాబు భయపడుతున్నారన్న విషయం స్పష్టమైపోయింది. కాబట్టి జరుగుతున్నది, లీకుల ద్వారా బయటకు వస్తున్నదంతా కేవలం కథలే అన్న విషయం అర్ధమైపోయింది.