ప్రకాశం: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు పవన్ కు చురకలు వేశారు. రాజకీయం అంటే సినిమా స్క్రిప్ట్ కాదని కౌంటర్ ఇచ్చారు. 

పవన్ కళ్యాణ్ కు, వైఎస్ జగన్‌కు మోదీ అంటే భయమని అందుకే బీజేపీని విమర్శించరని చెప్పుకొచ్చారు. ఒకరికి కేసుల భయం, మరొకరికి నల్లధనం భయమని జగన్, పవన్ లనుద్దేశించి వ్యాఖ్యానించారు.ప్రధాని మోదీ ఎక్కడ జైల్లో పెడతారో అని జగన్‌, పవన్‌ భయపడుతున్నారని విమర్శించారు. 

అవినీతికి పాల్పడే వారే కేసులకు భయపడతారని, తనకు ఆ భయం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిని ప్రపంచంలోని అత్యుత్తమ ఐదు నగరాల్లో ఒకటిగా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూసేలా రాజధాని నిర్మాణం చేపడతామని, తాను ఏది ఆలోచించినా దేశ భవిష్యత్తు కోసమేనని స్పష్టం చేశారు. 

కులం, మతం, ప్రాంతం పేరు చెప్పి ఓట్లు వేయటం కాదని, అభివృద్ధిని చూసి ఓటు వేయండని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో అమరావతి రాజధానికి అత్యంత దగ్గరగా ఉండే నగరంగా ఒంగోలు రూపాంతరం చెందుతుందన్నారు. ప్రకాశం జిల్లాను అభివృద్ధిలో నంబర్ 1 జిల్లాగా చేసే బాధ్యత తనదేనని చంద్రబాబు భరోసా ఇచ్చారు.