హైదరాబాద్: కాంగ్రెసుతో చీకటి ఒప్పందం కుదుర్చుకుని చిదంబరం, సోనియా కాళ్లు పట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై కుట్ర చేశారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా విమర్శించారు. ప్రత్యేక హోదాపై నాలుగేళ్లుగా మాట్లాడకుండా ఇప్పుడు ధర్మ పోరాట దీక్ష అంటూ ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. 

కేంద్రంలో మంత్రి పదవులు అనుభవిస్తూ నాలుగేళ్లుగా విభజన చట్టంలోని అంశాలను అమలు అయ్యేలా చూడడంలో టిడిపి విఫలమైందని ఆమె ఆదివారం మీడియా సమావేశంలో అన్నారు.

రాష్ట్ర భవిష్యత్తును స్వంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టిన చంద్రాబబు నమ్మకద్రోహి అని ఎందుకు పిలవకూడదో చెప్పాలని ఆమె అడిగారు. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పోరాడుతున్న తమ పార్టీ చేసిన ఉద్యమాలను ఉక్కు పాదంతో అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని అన్నారు. 

చంద్రబాబుది ధర్మపోరాటమో, దగా పోరాటమో ప్రజలకు అర్థమైందని ్న్నారు. నియోజకవర్గాలను పెంచితే చాలు ప్రత్యేక హోదా వద్దని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారని అన్నారు.

పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారని, అలాంటి చంద్రబాబు కుట్ర గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. చంద్రాబబు విజయవాడలో చేసిన 12 గంటల ధర్మ పోరాట దీక్ష ఆడియో ఫంక్షన్ లా ఉందని, మళ్లీ తిరుపతిలో ఈ నెల 30వ తేదీన ధర్మ పోరాట దీక్ష పోరాటదీక్ష పేరుతో ప్రజలను ఫూల్స్ చేయాలని చూస్తున్నారని అన్నారు. కానీ ప్రజలు దాన్ని టిడిపి నేతల ఫూల్స్ డే అని భావిస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. 

బిజెపి నుంచి బయటకు వచ్చిన తర్వాత మహారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్య స్వప్నకు టిటిడీ పాలక మండలిలో ఎందుకు చోటు కల్పించారని ఆమె చంద్రబాబును అడిగారు. అదేమిటని ప్రశ్నిస్తే అది తన వ్యక్తిగతమని చంద్రబాబు అంటున్నారని, రాజకీయాల్లో వ్యక్తిగతమేమిటని అన్నారు. గత నాలుగేళ్లలో స్వప్నకు టిటీడీలో చోటు కల్పించకుండా ఇప్పుడే ఎందుకు కల్పించారని ఆమె అడిగారు. పాలక మండలిలో సభ్యురాలిగా చేరేందుకు ఆంధ్రప్రదేశ్ లో మహిళలే లేరా అని అడిగారు. 

ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని అన్నారు.