Asianet News TeluguAsianet News Telugu

మడ అడవుల నరికివేతపై టీడీపీ నిజ నిర్ధారణ: పొలిట్‌బ్యూరో తీర్మానాలివే..

 కాకినాడ సమీపంలోని మడ అడవుల నరికివేతను టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం తీవ్రంగా ఖండించింది. ఈ విషయమై టీడీపీ ప్రతినిధి బృందం నిజనిర్ధారణ చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. 
 

Chandrababu conducts Politburo Meeting on video conference :here is resoltutions
Author
Amaravathi, First Published May 13, 2020, 3:46 PM IST


అమరావతి: కాకినాడ సమీపంలోని మడ అడవుల నరికివేతను టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం తీవ్రంగా ఖండించింది. ఈ విషయమై టీడీపీ ప్రతినిధి బృందం నిజనిర్ధారణ చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. 

తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం బుధవారం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వీడియో కాన్పరెన్స్ ద్వారా నిర్వహించారు.  ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో, జాతీయంగా అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను పోలిట్ బ్యూరో దృష్టికి తెచ్చారు. 
ప్రధాని నరేంద్రమోది రూ.20లక్షల కోట్ల ప్యాకేజి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.  

‘‘కరోనా ముందు, కరోనా సమయంలో, కరోనా తర్వాత’’ అనేవిధంగా ఇకపై ప్రపంచవ్యాప్త అధ్యయనాలు ఉంటాయి. ఆర్ధిక వ్యవస్థతో పాటు జీవన విధానంలో పెనుమార్పులు. నిరుద్యోగం, ఆహార సమస్య, ఆర్ధిక వ్యవస్థ తలకిందులు, రైతులు దెబ్బతినడం, పరిశ్రమలు సిక్ కావడం, ఉపాధి కోల్పోవడం, అనేక సమస్యలు చుట్టుముట్టాయన్నారు చంద్రబాబు.

also read:ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీకి అనుమతులు: వైసీపీ ఆరోపణలపై బాబు సవాల్ ఇదీ...

కరోనా నియంత్రణలో విఫలమైతే జరిగే నష్టం అపారం. ప్రజలను మానసికంగా సిద్దం చేయడం ముఖ్యం. పాలకులు అసమర్ధులు అయితే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. దేశంలో ఇప్పుడు  లాక్ డౌన్ -4లోకి రాబోతున్నాం. లాక్ డౌన్ 1 నుంచి 4వరకు ఆంక్షలు సడలిస్తూ వస్తున్నారు. గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టయినబుల్ ట్రాన్స్ ఫర్మేషన్ (జిఎఫ్ ఎస్ టి) ద్వారా కేంద్రానికి( ప్రధాని, పిఎంవో, నీతిఅయోగ్ లకు) 5 లేఖలు రాసినట్టుగా ఆయన గుర్తు చేశారు.

ప్రధాని వాజ్ పేయి హయాంలో టిడిపి ఆధ్వర్యంలో వేసిన కమిటి సిఫారసులతో టెలి కమ్యూనికేషన్ల రంగంలో అభివృద్ది సాధ్యం అయ్యింది. ఇన్సూరెన్స్ పాలసీలలో మార్పులు వచ్చాయి. సూక్ష్మ సేద్యంపై వేసిన కమిటి సిఫారసులతో దేశవ్యాప్తంగా మైక్రో ఇరిగేషన్ అభివృద్ధికి దోహదపడింది. దేశ వ్యాప్తంగా నదుల అనుసందానంపై చర్చకు నాంది పలికింది. డిమానిటైజేషన్ పై కమిటి సిఫారసులతో డిజిటల్ చెల్లింపులు పెరిగాయని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

టిడిపి ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవస్థలను నిర్మిస్తే, గత ఏడాదిలోనే  వైసిపి ప్రభుత్వం వాటిని ధ్వంసం చేసింది. కరెంటు బిల్లులు 4రెట్లు పెరిగాయని పేదలు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం, అరటి, మామిడి, బత్తాయి, బొప్పాయి, కర్బూజ, పుచ్చ తదితర పండ్లతోటల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.

అకాల వర్షాలతో రెండు రాష్ట్రాలలో  పంట నష్టం జరిగింది. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.కరోనాను సమర్ధంగా ఎదుర్కొన్నవాళ్లు, దేశాలు-రాష్ట్రాలే భవిష్యత్తులో నిలదొక్కుకుంటారని ఆయన చెప్పారు.

లాక్ డౌన్ ప్రకటించడం ద్వారా ప్రధాని దేశాన్ని కట్టుబాటు చేయగలిగారు. అయితే నిబంధనల అమలులోనే కొన్ని రాష్ట్రాలలో పొరబాట్లు జరిగాయన్నారు. మద్యం దుకాణాలు తెరవడం తప్పిదంగా మారిందన్నారు.. జూన్, జులైలో కేసులు మరింత పెరుగుతాయనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు.

కరోనా నియంత్రణలో మొదట్లో క్వారంటైన్ సక్రమంగా చేయలేక పోయారు. జోన్లుగా విభజించినా సక్రమంగా పర్యవేక్షించడంలో విఫలం అయ్యారు. మద్యం దుకాణాలు తెరవడం వల్ల సమస్య పెరిగిందన్నారు.ఏపిలో మద్యం మూడిందాలా నష్టం చేసింది. నాసిరకం బ్రాండ్లతో ఆరోగ్యం దెబ్బతింది. ఆర్ధికంగా జేబులు గుల్ల చేశారు. గుంపులుగా చేరడం వల్ల కరోనా కేసులు పెరిగాయని’’ చంద్రబాబు ఆవేదన చెందారు.

 పోలిట్ బ్యూరోలో చర్చించిన అంశాలు-తీర్మానాలు

విశాఖ గ్యాస్ లీకేజి మృతులకు టిడిపి పోలిట్ బ్యూరో నివాళులు అర్పించింది. రెండు రాష్ట్రాలలో కోవిడ్ మృతులకు నివాళులు అర్పించారు.  బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది. రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు, చేనేత కార్మికులు, కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటాన్ని ఖండించింది. తక్షణమే ఆయా కుటుంబాల వారిని  ఆదుకోవాలని కోరింది.

మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ సహా విశాఖలోని జలాశయాల్లో నీళ్లు కలుషితం కావడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్లలోకి వచ్చినవాళ్లు కూడా విషవాయువు తీవ్రతకు భయపడి  మళ్లీ వెళ్లిపోవడం ఆందోళనకరంగా సమావేశం అభిప్రాయపడింది.

ఎంత పరిధిలో ప్రజలు విషవాయువుల దుష్ప్రభావానికి లోనవుతారు, వాటి దుష్పరిణామాల నుంచి బాధితులను కాపాడటం, ద్రవరూపంలో ఉండే స్టైరీన్ వాయువుగా మారడం, అందులో రసాయనం ఏమైనా కలిసిందా, భవిష్యత్తులో అక్కడి ప్రజల ఆరోగ్యంపై, పంటలపై, ఇతర జీవరాశిపై ప్రభావాల గురించి సమగ్రంగా, శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. 

జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే పూడ్చాలి. బాధితులను ఎలా ఆదుకోవాలన్నదే ప్రధానం. గ్యాస్ లీకేజి దుర్ఘటన దుష్ప్రభావాన్ని ఎలా అధిగమించాలన్నదే ముఖ్యం.
ఎల్జీ పాలిమర్స్ కంపెనీని మూసేయాలని, నిందితులను శిక్షించాలని, బాధితులను ఆదుకోవాలని తీర్మానం ఆమోదించారు.

ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరపాలి. ఇది మానవ తప్పిదం కాబట్టి నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలి. 12మంది చావుకు కారణమైన ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని శిక్షించాలి. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే కరోనా రాష్ట్రంలో  వ్యాప్తి చెందుతోందని సమావేశం అభిప్రాయపడింది. గుంటూరులో వైసిపి నాయకుడు ఇచ్చిన విందు వల్ల దుష్ఫలితాలు చూశాం. వైసిపి ఎమ్మెల్యేలే కరోనా సూపర్ స్ప్రెడర్లుగా మారారు. శ్రీకాళహస్తిలో ట్రాక్టర్ల ర్యాలీ, నగరిలో, కనిగిరిలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి వైరస్ వ్యాప్తికి కారణం అయ్యారని సమావేశం ఆరోపించింది.. 

జిఎఫ్ ఎస్ టి చేసిన అధ్యయనాన్ని పోలిట్ బ్యూరోలో ప్రశంసించారు. మొత్తం దేశానికే ప్రయోజనకరమైన అధ్యయనాలు చేయడాన్ని అభినందించారు. 
జోన్ల వర్గీకరణపై, ఎంఎస్ ఎంఈ రంగాన్ని ఆదుకోవడంపై సూచనలు చేశారు. 80% ఉపాధి కల్పించే రంగం ఎంఎస్ ఎంఈ రంగమే కాబట్టి వడ్డీలేని రుణాలు ఇచ్చి ఎంఎస్ ఎంఈ రంగాన్ని ఆదుకోవాలి. కార్మికులకు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించగలిగే సామర్ధ్యం పెంచేలా చూడాలని సమావేశం కోరింది.

రైతుల వద్ద పంట ఉత్పత్తులను ప్రభుత్వమే సేకరించాలి, కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. హార్టీ కల్చర్, ఆక్వా కల్చర్, సెరి కల్చర్ రైతాంగాన్ని ఆదుకోవాలి.
వలస కార్మికులను కేరళ ప్రభుత్వం గెస్ట్ వర్కర్లుగా పేర్కొంది. వాళ్లను ఆతిథ్య కార్మికులుగానే చూడాలని సమావేశం అభిప్రాయపడింది.

ఏపిలో కరోనా కష్టకాలంలో కూడా బ్లీచింగ్ లో కూడా రూ.70కోట్ల కుంభకోణానికి వైసీపీ నేతలు పాల్పడటాన్ని  సమావేశం ఖండించింది. కరోనా కిట్ల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారు.లాక్ డౌన్ లో కూడా ఇసుక దందాలు, గ్రావెల్ తరలింపును పోలిట్ బ్యూరోలో ఖండించారు. లాక్ డౌన్ లో మద్యం దుకాణాలను తెరవడాన్ని ఖండించారు. మద్యం దుకాణాల వద్ద టీచర్లను నియమించడాన్ని సమావేశం తప్పుబట్టింది.

మడ అడవులను విచక్షణారహితంగా నరికేయడాన్ని పోలిట్ బ్యూరోలో టిడిపి నేతలు ఖండించారు. దీనివల్ల భవిష్యత్తులో తీరప్రాంతానికి తుఫాన్ల ముప్పు ఉంటుందని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆవభూముల కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడటాన్ని గర్హించారు. 

టిడిపి ప్రతినిధుల బృందాలు రెండు ఈ ప్రాంతాల్లో పర్యటించి వీటిపై నిజ నిర్దారణ చేయాలని తీర్మానించారు. పేదలకు ఇళ్ల స్థలాల ముసుగులో భూముల కొనుగోళ్లలో ప్రతి నియోజకవర్గంలో వైసిపి నాయకులు భారీ అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఎకరం రూ 7లక్షలు చేయని భూములను రూ70లక్షలకు కొని వాటాలు వేసుకుని పంచుకోడాన్ని గర్హించారు. ముడుపుల కోసమే మద్యం రేట్లను భారీగా పెంచాలని దుయ్యబట్టారు.

 ప్రాణాలు కూడా లెక్కపెట్టుకోకుండా కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్లను  సమావేశం అభినందించింది.. 40రోజులపాటు వారు చేసిన  త్యాగాలను మద్యం దుకాణాలు తెరిచి బూడిదపాలు  చేశారు. లాక్ డౌన్ తో కోట్లాది ప్రజలు ఇళ్లకే పరిమితమై ఉపాధి కోల్పోయి త్యాగాలు చేశారు. వాళ్ల మొరాలిటి దెబ్బతీసేలా మద్యం దుకాణాలు తెరవడాన్ని టిడిపి పోలిట్ బ్యూరో ఖండించింది.

ఏపీలోప్రతి పేద కుటుంబానికి రూ 10వేలు ఇవ్వాలి. కేరళ తరహాలో 17రకాల నిత్యావసర సరుకులు రాబోయే లాక్ డౌన్ లో కూడా ఇంటింటికి పంపిణీ చేయాలి.
కరెంటు ఛార్జీలు పెంచడాన్ని పొలిట్ బ్యూరో ఖండించింది. ఇప్పటికే ఆర్టీసి ఛార్జీలు పెంచారు. ఇసుక, మద్యం ధరలు, పెట్రోల్, డీజిల్  రేట్లు పెంచేశారు. ధరలు పెంచి భారాలు వేయడాన్ని గర్హించారు.

పంటలు అమ్ముడుపోక నష్టాల్లో మునిగిన రైతులు, ఉపాధి కోల్పోయిన కార్మికులకు మద్దతుగా 12గంటల నిరాహార దీక్షలు చేసిన టిడిపి నాయకులను పోలిట్ బ్యూరో అభినందించింది. కూరగాయలు, నిత్యావసరాలు, కోడిగుడ్లు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసిన దాతలను అభినందించింది. మద్యం దుకాణాలు మూసేయాలని, ప్రజారోగ్యం కాపాడాలని 12గంటల దీక్షలు చేసిన తెలుగు మహిళలను అభినందించింది.

టిడిపి నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో గర్హించింది. విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటనలో బాధితులపై, వారికి అండగా నిలబడ్డ ప్రతిపక్షాల నాయకులపై కేసులు పెట్టడాన్ని ఖండించింది. దాతలిచ్చే సాయం కూడా తమ పేరుతో పంపిణీ చేయాలని, తమకు అందజేస్తే తామే పంపిణీ చేస్తామని వైసిపి నాయకులు పేర్కొనడాన్ని గర్హించింది. అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేసింది.

టిడిపి మహానాడును వర్ట్యువల్ గా నిర్వహించడంపై పోలిట్ బ్యూరోలో చర్చించారు. అందులో చేపట్టాల్సిన తీర్మానాలు, కమిటిల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు, ఎల్ రమణ, పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, రావుల చంద్రశేఖర రెడ్డి, ప్రతిభా భారతి, నారా లోకేష్, గల్లా జయదేవ్ , అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, అరుణ కుమారి, వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios