చంద్రబాబునాయుడు కూడా ఎన్నికల కసరత్తు మొదలుపెట్టారా? పార్టీ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే, పార్టీ ప్రజాప్రతినిధులతో చంద్రబాబు ఆదివారం పెద్ద వర్క్ షాప్ పెట్టారు.  ఈ ఎన్నికల్లో మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు, ఎంఎల్సీలతో పాటు జిల్లా స్ధాయి నేతలందరూ పాల్గొనాలని ఆదేశించారు. దాంతో పార్టీలోని నేతల్లో దాదాపు ఇప్పటికే  విజయవాడకు చేరుకున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించటమే లక్ష్యంగా ఈ వర్క్ షాపులో ప్రసంగాలు, ఉపన్యాసాలుంటాయని వేరే చెప్పక్కర్లేదు.

చంద్రబాబుతో పాటు లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు కేంద్రమంత్రులు, పార్టీ బాధ్యులు కీలక పాత్ర పోషిస్తారు. ఒకవైపు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జరుగుతోంది. జనాలు కూడా బాగానే స్పందిస్తున్నారు. మరోవైపు మిత్రపక్షం టిడిపిపై రెచ్చిపోతోంది. ఇటువంటి నేపధ్యంలో వర్క్ షాప్ నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించటం పార్టీలో పెద్ద చర్చ మొదలైంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎనిమిది అంశాలపై చర్చలు జరుగనున్నట్లు నేతలు చెబుతున్నారు.

విభజన చట్టం హామీల అమలు, పోలవరం, రాజధాని నిర్మాణం, మిత్రపక్షంతో సంబంధాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేయాల్సిన పనులు, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్ధితి, నియోజకవర్గాల్లో నేతల సమన్వయం తదితర అంశాలపై చర్చలు ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం పార్టీ తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు, లోకేష్ దిశానిర్దేశం చేస్తారు. కాపులు బిసి, దళితులను దగ్గరకు తీసుకోవటానికి తీసుకోవాల్సిన ప్రణాళికలపైన చర్చ ఉంటుందని ఎంఎల్సీ పయ్యావుల కేశవ్ చెప్పారు. ఇంటింటికి టిడిపి, జన్మభూమి కార్యక్రమం జరిగిన తీరుపైన కూడా చర్చ జరుగుతుందని కేశవ్ చెప్పారు.