చంద్రబాబు అరెస్ట్ ... పోలీసులు మరీ ఎక్కువ చేస్తున్నారు : కేంద్ర హోంశాఖకు టిడిపి కంప్లైంట్
చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా రోడ్డెక్కిన ప్రజలపై పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారంటూ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదుచేసారు టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్.

అమరావతి : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఆ తర్వాత పరిణామాలు ఏపీలో అలజడి రేపుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఆందోళనలు చేపడుతున్న టిడిపి శ్రేణులనే కాదు స్వచ్చందంగా పాల్గొంటున్న ప్రజలపైనా పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని తెలుగు తమ్ముళ్ళు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అవినీతి మరకలేని మాజీ సీఎంపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వుంచడంతో ప్రజలు, ప్రజాసంఘాలు రోడ్లపైకి వస్తున్నారని... వైసిపి నాయకుల ఆదేశాలతో వారిపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేసారు.
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో బ్రిటీష్ కాలంలో కూడా లేనన్ని ఆంక్షలు వున్నాయని... ప్రజల్ని జగన్ సర్కార్ వేధిస్తోందని అనగాని ఆరోపించారు. వైసిపి నేతలకు తప్ప ప్రతిపక్షాలు, ప్రజలకు మాత్రమే 144 సెక్షన్ వర్తిస్తోందని అన్నారు. అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్ ను కొందరు పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని... అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖను ఎమ్మెల్యే సత్యప్రసాద్ కోరారు.
చంద్రబాబు నాయుడుపై అభిమానంలో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారని... అలాంటివారిని పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నారు. నిరసనల్లో పాల్గొన్నవారికి పోలీసులు నోటీసులు ఇస్తున్నారని అన్నారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని టిడిపి ఎమ్మెల్యే అన్నారు.
Read More నారా లోకేష్ ను అరెస్టు చేయొచ్చు, దేవాన్షు అడుగుతాడు: నారా బ్రాహ్మణి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు అరెస్టుకు నిరసనకు దిగిన విద్యార్థులపై కేసులు నమోదు చేయటం, కాలేజీ యాజమాన్యాలను బెదిరించడం ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు నిదర్శనమన్నారు. వైసిపి సభలకు బలవంతంగా విద్యార్థులను తరలించినా పట్టించుకోని పోలీసులు టిడిపి సభలకు స్వచ్చందంగా వెళుతుంటే అడ్డుకుంటున్నారని అన్నారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై 307 వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. ఇలా ఏపీ పోలీసుల అధికార దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సెక్రటరీని కోరారు ఎమ్మెల్యే సత్యప్రసాద్.