నారా లోకేష్ ను అరెస్టు చేయొచ్చు, దేవాన్షు అడుగుతాడు: నారా బ్రాహ్మణి సంచలన వ్యాఖ్యలు
టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు విషయంలో ఆధారాలు ఎక్కడ అని తమ కుమారుడు దేవాన్ష్ కూడా అడుగుతాడని ఆమె అన్నారు.

కాకినాడ: తెలుగుదేశం పార్టీ (టిడిపి) ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ను కూడా రేపో మాపో అరెస్టు చేయవచ్చునని ఆమె అన్నారు. దేశ ప్రజాస్వామ్యానికి ఇవి చీకటి రోజులు అని ఆమె అన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శకనేత ఆమె ప్రశంసించారు.
చంద్రబాబు నాయుడు ఐటిని మన దేశానికి తెచ్చి యువతీయువకులకు ఉద్యోగావకాశాలు కల్పించారని, నీతీ నిజాయితీలతో నడుచుకున్నారని, సంక్షేమం కోసం ఎల్లవేళలా తపించారని నారా బ్రాహ్మణి అన్నారు. అలాంటి మహా నాయకుడిని అన్యాయంగా, ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని ఆమె విమర్శించారు. చంద్రబాబు కుటుంబ సభ్యురాలిగా కాకుండా ఓ యువతిగా తాను ఆవేదన చెందుతున్నట్లు ఆమె తెలిపారంు.
రాజమహేంద్రవరంలో శుక్రవారం జరిగిన బాబుతో నేను కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రజల కోసం నిత్యం పనిచేసే సీనియర్ నాయకుడి పరిస్థితే అలాత ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు.
తన భర్త నారా లోకేష్ ను కూడా రేపోమాపో అరెస్టు చేయవచ్చునని నారా బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేశారు. టిడిపి కుటుంబం చాలా శక్తివంతమైందని ఆమె అన్నారు. నాయకులు, కార్యకర్తలు, కుటుంబసభ్యులు పోరాటం చేస్తున్నారని ఆమె అన్నారు. వచ్చే వారం చంద్రబాబు బయటకు వస్తారనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. చంద్రబాబు సభలు, బస్సు యాత్రలు, లోకేష్ యువగళం పాదయాత్ర వంటి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగడం చూసి ప్రభుత్వం తడబడిందని, దాంతో ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేసిందని ఆమె అన్నారు.
రిమాండు రిపోర్టును తమ కుమారుడు దేవాన్ష్ చదివినా అందులో ఆధారం ఎక్కుడుందని అడుగగలుతాడని ఆమె అన్నారు. రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందని, నిరుద్యోగం పెరిగిందని ఆమె అన్నారు. ప్రొఫెషనల్ కాలేజీల్లో చంద్రబాబు మహిళలకు రిజర్వేషన్లు కల్పించినందు వల్లనే తకు అప్పట్లో మెరిట్ సీటు వచ్చిందని, తన లాంటివాళ్లు చాలా మంది ఉన్నారని ఆమె అన్నారు. దానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం గంజాయి, మద్యం ఇచ్చి విద్యార్థులను భవిష్యత్తును పాడు చేస్తోందని ఆమె విమర్శించారు.
ఐటి నిపుణులు చంద్రబాబు అరెస్టును ఖండించారని ఆమె గుర్తు చేశారు. జాతీయ, ప్రాంతీయ స్థాయి నేతలను రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నట్లు ఆమె చెప్పారు. ఒక నాయకుడికి ఇంత మద్దతు లభించడం ఏనాడూ చూడలేదని ఆమె అన్నారు. స్వచ్ఛందంగా బయటకు వచ్చి మద్దతు ఇస్తున్నవారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.