చంద్రబాబు అరెస్ట్ : అర్థరాత్రి నుంచి అరెస్ట్ వరకు.. ఎప్పుడేం జరిగిందంటే? ..
నంద్యాలలో బహిరంగ సభ ముగిసిన తరువాతి నుంచి చంద్రబాబు అరెస్ట్ వరకు ఆర్ కె ఫంక్షన్ హాల్, నంద్యాలలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

నంద్యాల : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అత్యంత నాటకీయ పరిణామాల మధ్య శనివారం తెల్లవారుజామున సిఐడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనికంటే ముందు ఆరు బస్సుల్లో భారీగా అనంతపురం నుంచి పోలీసులు నంద్యాలకు చేరుకోవడంతో అక్కడ అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబు నాయుడుని అరెస్టు చేస్తారన్న వార్తలు వెలుగులోకి రావడంతో టిడిపి నేతలు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడు బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ దగ్గరికి భారీ మొత్తంలో చేరుకున్నారు.
అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఆర్కే ఫంక్షన్ హాల్ కు చేరుకున్న పోలీసులు చంద్రబాబు నాయుడుని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించడంతో పార్టీ నేతలు, పోలీసుల మధ్య తీవ్రవాగ్వాదం నెలకొంది. రాత్రి మూడు గంటల ప్రాంతంలో చంద్రబాబు ఉన్న బస్సు దగ్గరికి పోలీసులు వెళ్లడానికి ప్రయత్నించారు. దీనిని నేతలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఇంత రాత్రివేళ ఎందుకు రావాల్సి వచ్చిందని టిడిపి నాయకులు ప్రశ్నించారు.
చంద్రబాబును ఎలాగైనా జైలులో ఉంచాలన్నదే కుట్ర.. అక్రమ అరెస్ట్‌లకు భయపడేది లేదు: బాలకృష్ణ
దీనికి సమాధానం చంద్రబాబు నాయుడుకే చెబుతాం మీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ పోలీస్ అధికారులు తెలిపారు. టిడిపి నేతలు, పోలీసుల సమాధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్న వాహనాలను పోలీసులు తొలగించి.. పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపారు.
ఆర్కే ఫంక్షన్ హాల్ దగ్గర ఆ సమయంలో ఉన్న మాజీమంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యేలు భూమా బ్రహ్మానందరెడ్డి, బిసి జనార్దన్ రెడ్డి, మరికొందరు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత చంద్రబాబు ఉన్న బస్సు అద్దాలను గట్టిగా కొట్టారు. కాసేపటికి చంద్రబాబు నాయుడు బస్సులో నుంచి కిందికి వచ్చారు. దీంతో ఆయన అరెస్టు విషయం తెలిపి ఆయనతో మాట్లాడారు. దాదాపు 6 గంటల పాటు హైడ్రామా నడిచింది.
చంద్రబాబు నాయుడు తనను అరెస్టు చేసే అధికారం లేదంటూ వాదించారు. సిబిఐ తన హక్కులను ఉల్లంఘిస్తోందని అన్నారు. తప్పు చేస్తే నడిరోడ్డుపై ఉరి తీయమంటూ, తన ఏ చట్టం ప్రకారం అరెస్టు చేస్తున్నారో చెప్పాలని అధికారులను నిలదీశారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ప్రశ్నించారు. హైకోర్టుకు తమ ప్రాథమిక ఆధారాలు ఇచ్చినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
చంద్రబాబు న్యాయవాదులు ఆధారాలు చూపాలన్న దానికి సమాధానంగా రిమాండ్ రిపోర్ట్ లో అన్ని వివరాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు బస్సులో నుంచి దిగిన తర్వాత గంటపాటు వాదప్రతివాదాలు జరిగాయి. చంద్రబాబును అవినీతి ఆరోపణలపై అరెస్టు చేస్తున్నట్లుగా పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు తమకు సహకరించి విజయవాడకు తమతో పాటు వస్తే 15 నిమిషాల్లో వారు కోరిన అన్ని పత్రాలను వాట్సాప్ లో పంపిస్తామని అధికారులు తెలిపారు. వాద ప్రతివాదాల తర్వాత చంద్రబాబు నాయుడుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు భద్రతా దళం సమక్షంలోనే విజయవాడకు తరలించారు.
‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి నంద్యాలలో బహిరంగ సభలో పాల్గొన్నారు. బహిరంగ సభానంతరం అర్ధరాత్రి 12 గంటల నుంచి అరెస్టు నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాల్ చుట్టూ వందలాది పోలీసులు మోహరించారు. దీనికోసం 600 మందికి పైగా పోలీసులు నంద్యాలకు చేరుకున్నారు.
ఉద్రిక్తతలు నెలకొనకుండా నంద్యాల నగరాన్ని దిగ్బంధించారు. నంద్యాలలో అడుగడునా బారికేడ్లు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆర్కే ఫంక్షన్ హాల్ ప్రాంగణం నుంచి టీడీపీ కార్యకర్తలు మీడియా ప్రతినిధులను దూరంగా పంపించేశారు. ఆ తర్వాత ఆ ప్రాంగణంలో ఉన్న కార్యకర్తలు, నేతల వాహనాలను తొలగించి పోలీసు వాహనాలను లోపలికి తీసుకెళ్లారు. ఆ ప్రాంతాన్ని మొత్తం పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
డిఐజి రఘురామిరెడ్డి, ఎస్పి రఘువీర్ రెడ్డిల నేతృత్వంలోని పోలీసు సిబ్బంది చంద్రబాబును నిద్రలేపేందుకు ప్రయత్నిస్తుండగా.. డిఐజి రఘురామిరెడ్డి టిడిపి నాయకుల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. టిడిపి కర్నూలు జిల్లా అధ్యక్షుడు బిటి నాయుడు, మాజీమంత్రి కాలువ శ్రీనివాసులు తలుపుకు అడ్డంగా నిలబడి ప్రతిఘటించారు.
అంత రాత్రి సమయంలో చంద్రబాబు నిద్రలేపేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ గొడవకు దిగారు. చంద్రబాబును నిద్ర లేపేందుకు తాము ఒప్పుకోమని స్పష్టం చేశారు. దీనికి పోలీసులు సమాధానం ఇస్తూ అడ్డు తొలగకపోతే బాబును బస్సుతో పాటే లాక్కెళ్లాల్సి ఉంటుందని బెదిరించారు.
దీంతో టిడిపి నేతలు కాల్వ శ్రీనివాసులు, ఇతర టిడిపి నాయకులు అసహనం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి మీరిచ్చే గౌరవమిదేనా అంటూ మండిపడ్డారు. ఏ చర్యలు తీసుకోవాలనుకున్నా.. ఏం మాట్లాడాలన్నా.. ఉదయం రావాలని తెలిపారు. ఆ తర్వాత బస్సులో నుంచి దిగిన చంద్రబాబు నాయుడుతో వాదనల అనంతరం… ఆయనని అరెస్టు చేసి.. ఆయన భద్రతా బలగాల మధ్యలోనే విజయవాడకు తరలిస్తున్నారు.