చంద్రబాబును ఎలాగైనా జైలులో ఉంచాలన్నదే కుట్ర.. అక్రమ అరెస్ట్‌లకు భయపడేది లేదు: బాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడును సీఐడీ అధికారులు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్‌ను హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఖండించారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడును సీఐడీ అధికారులు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను టీడీపీ నాయకులతో పాటు పలువురు విపక్ష నేతలు ఖండిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను టీడీపీ నేత, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఖండించారు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ దుర్మార్గం అని నందమూరి బాలకృష్ణ అన్నారు. రాజకీయ కుట్రతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని మండిపడ్డారు. చంద్రబాబును ఎలాగైనా జైలులో ఉంచాలనేదే జగన్ కుట్ర అని ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన జగన్.. ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకే పరిమితమయ్యారని విమర్శించారు. ఆధారాలు లేకుండా ఏ చట్టప్రకారం చంద్రబాబును అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు చార్జిషీట్ వేయలేదని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని పేర్కొన్నారు. న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు.
ఒక్క పథకం ప్రకారం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును అరెస్ట్ చేశారని అన్నారు. ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసి సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు.