చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై సీఐడీ కౌంటర్ దాఖలు.. ఐదు రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. అలాగే చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ కూడా దాఖలు చేశారు.

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. అయితే సీఐడీ కౌంటర్‌లోని రెండు పేరాలపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ రెండు పేరాలు తొలగించి మళ్లీ కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశించారు. మరోవైపు చంద్రబాబు కస్టడీ విచారణకు సంబంధించిన నివేదికను సీఐడీ అధికారులు సీల్డ్ కవర్‌లో సమర్పించారు. దానితో పాటు చంద్రబాబు ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ కూడా దాఖలు చేశారు. చంద్రబాబు విచారణకు సహకరించడం లేదని..కస్టడీ పొడిగించాలని సీఐడీ కోరింది.
తొలుత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరారు. మరోవైపు ముందుగా చంద్రబాబు కస్టడీ పొడిగింపుపై దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు వినాలని సీఐడీ తరఫు న్యాయవాదులు కోరారు. అయితే మెమో ఫైల్ చేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. కస్టడీ పొడిగింపు మెమో సీఐడీ ఫైల్ చేసిన తర్వాత విచారణ చేస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చెప్పారు. మరోవైపు బెయిల్ పిటిషన్‌పై విచారణకు మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేశారు.