గన్నవరం: కృష్ణా జిల్లాలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జీగా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడును నియమిస్తూ చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.

గత ఎన్నికల సమయంలో గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించిన వల్లభనేని వంశీ  వైసీపీకి మద్దతు ప్రకటించారు. టీడీపీ నుండి వల్లభనేని వంశీని సస్పెండ్ చేశారు. 

పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పారు. జగన్ కు మద్దతు ప్రకటించారు. అసెంబ్లీలో తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని వంశీ కోరారు. ఈ వినతికి స్పీకర్ సానుకూలంగా స్పందించారు.

వంశీ పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ ఇంఛార్జీ ఎవరూ లేరు. దీంతో పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్టీ క్యాడర్ ను ఏకతాటిపై నడిపించేందుకు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడును ఇంఛార్జీగా నియమిస్తూ చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. 

2009 వరకు ఈ నియోజకవర్గం నుండి టీడీపీ నేత దాసరి బాలవర్ధన్ రావు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. అయితే 2014, 1019 ఎన్నికల్లో దాసరి బాలవర్ధన్ రావుకు కాకుండా వల్లభనేని వంశీకి చంద్రబాబు టిక్కెట్టు ఇచ్చాడు.దాసరి బాలవర్ధన్ రావు గత ఎన్నికల సమయంలో టీడీపీ నుండి వైసీపీలో చేరారు.