మరోసారి ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఎప్పుడు, ఎందుకు? అంటే...
మరో ఒకటి రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులు ఢిల్లీ వెళ్తారని ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు రేపు ఢిల్లీలో బిజెపి కీలక సమావేశం జరగనుంది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. ఇది ఇప్పుడు ఢిల్లీని తాకుతోంది. టిడిపి జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే వందకు పైగా సీట్లను ప్రకటించాయి ఈ ఉమ్మడి పార్టీలు. ఉమ్మడిగా అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన ఈ రెండు పార్టీలు బుధవారం నాడు తాడేపల్లి వేదికగా తొలి ఉమ్మడి సభ నిర్వహించబోతున్నాయి. దీనికోసం పెద్ద సంఖ్యలో కార్యకర్తలను సభాస్థలికి చేరుకుంటున్నారు.
ఈ రెండు పార్టీలు ఈ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వేదికపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు 500మంది నేతలు ఉండబోతున్నారట. దాదాపు 6 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన కూటమి అధికారంలోకి రావడమే వీరి లక్ష్యంగా నేతలు తమ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయబోతున్నారు.
జనసేనతో పొత్తు ఎఫెక్ట్ ... టిడిపికి మాజీ మంత్రి రాజీనామా, వైసిపిలోకి జంప్...
తాడేపల్లిలో నేడు సభ ముగిసిన తర్వాత చంద్రబాబునాయుడు ఇక్కడి నుంచి నేరుగా హైదరాబాదుకు చేరుకుంటారు. ఆ తరువాత మరో ఒకటి రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులు ఢిల్లీ వెళ్తారని ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు రేపు ఢిల్లీలో బిజెపి కీలక సమావేశం జరగనుంది. మార్చి మొదటివారంలో బిజెపి ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉందనితెలుస్తోంది.
దీంతో, బీజేపీ తొలి జాబితా విడుదలకు ముందే చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో ఢిల్లీ బీజేపీ పెద్దలు భేటీ కానున్నారనే ప్రచారం సాగుతోంది. ఇక, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఆరేడు ఎంపీ స్థానాలను ఆశిస్తోందట భారతీయ జనతా పార్టీ. అరకు, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, ఒంగోలు, తిరుపతి, రాజంపేట, హిందూపురం లోక్ సభ స్థానాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు-పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఎలా సాగుతోంది. పొత్తుల వ్యవహారం తేలుతుందా? మరోసారి టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటి చేస్తాయా? అనేది అసక్తికరంగా మారింది.