జనసేనతో పొత్తు ఎఫెక్ట్ ... టిడిపికి మాజీ మంత్రి రాజీనామా, వైసిపిలోకి జంప్...
టిడిపి-జనసేన కూటమి అభ్యర్థుల జాబితా వెలువడిన నాటినుండి పసుపు పార్టీలో అలజడి మొదలయ్యింది. ఇప్పటికే పలువురు ఆ పార్టీని వీడగా తాజాగా ఓ మాజీ మంత్రి కూడా గుడ్ బై చెప్పి వైసిపిలో చేరేందుకు సిద్దమయ్యారు.
విజయవాడ : ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రకటన ప్రధాన పార్టీలకు కత్తిమీద సాములా మారింది. టికెట్ల కేటాయింపు సమయంలో అధికార వైసిపిలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రస్తుతం టిడిపి అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. జనసేన పొత్తు కారణంగా కొందరు, వైసిపి నుండి చేరికలు, తీవ్ర పోటీ కారణంగా మరికొందరు, సామాజిక సమీకరణలతో మరికొందరికి టిడిపి టికెట్ దక్కలేదు. ఇక ఇంకొందరు నేతలు తమకు టికెట్ దక్కదని భావించి ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ఇలా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టిడిపికి గుడ్ బై చెప్పి వైసిపిలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించింది టిడిపి. ఇలా పొత్తులో భాగంగా దక్కిన కొన్ని నియోకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను కూడా జనసేన ప్రకటించింది. మిగతా చోట్ల కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను జనసేన వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే రాజోలు టికెట్ కూడా జనసేనకే దక్కుతుందన్న సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఆ సీటు ఆశించిన మాజీ మంత్రి సూర్యారావు తీవ్ర అసహనంతో రగిలిపోతూ పార్టీకి రాజీనామా చేసారు. ఇదే అదునుగా ఆయనను తమవైపు తిప్పుకోడానికి కేశినేని నానిని రంగంలోకి దింపింది అధికార వైసిపి.
విజయవాడ ఎంపి కేశినేని నానితో సంప్రదింపులు జరిపిన సూర్యారావు తాజాగా మరో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కలిసారు. స్వయంగా నాని సూర్యారావును వెంటపెట్టుకుని వెళ్ళి మిథున్ ను కలిపించారు. ముఖ్య అనుచరులతో పాటు తన వెంటనడిచేందుకు సిద్దమైన టిడిపి నాయకులను సూర్యారావు ఎంపీలకు పరిచయం చేసినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి మాజీ మంత్రి వైసిపిలో చేరడానికి సిద్దమయినట్లు అర్థమవుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
సూర్యారావు ఇప్పటికే టిడిపి కార్యకలాపాలకు దూరంగా వుంటున్నారు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసిపి కండువా కప్పుకోనున్నారు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన కేశినేని నానియే సూర్యారావును సీఎం వద్దకు తీసుకుపోన్నారని... ఆయన రాజకీయ భవిష్యత్ పై హామీ ఇప్పించి పార్టీ కండువా కప్పించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ చేరిక కార్యక్రమం వుండగా ఇప్పటికే సూర్యారావు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన వైసిపి కండువా కప్పుకోనున్నారు.
వీడియో