ప్రధాన ప్రతిపక్షం వైసిపి వల్లే కేంద్రం ఏపికి అన్యాయం చేసిందని చంద్రబాబునాయుడు మండిపడ్డారు. అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో చంద్రబాబు పరిస్ధితిని సమీక్షించారు. బడ్జెట్లో ఏపికి జరిగిన అన్యాయంపై టిడిపి ఎంపిలు బాగా పోరాటం చేసినట్లు అభినందించారు. తుదివిడత సమావేశాలు మార్చి 5వ తేదీ నుండి మొదలయ్యే సమయానికి టిడిపి డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చంద్రబాబు ఆశాభావంతో ఉన్నారు.

ఏపికి కేంద్రం చేస్తున్న అన్యాయం వెనుక వైసిపి ఉందని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్లలేక వైసిపి ఎంపిలు కేంద్రానికి వరుసబెట్టి ఫిర్యాదులు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. దానివల్లే కేంద్రం కూడా నిధుల విషయంలో బాగా స్ట్రిక్ట్ అయిపోయిందన్నారు. అంటే, చంద్రబాబు లెక్క ప్రకారం ఏపిలో అభివృద్ధిలో ఏమి జరిగినా ఎవరూ నోరెత్త కూడదన్నట్లుగానే ఉంది. కేంద్రం మెడలు వంచి నిధులు తేలేక ఆ నెపాన్ని వైసిపి మీదకు నెడుతున్నట్లే కనబడుతోంది.