ముప్పేట దాడి: ఎపి రాజకీయాల్లో చంద్రబాబు ఏకాకి

ముప్పేట దాడి: ఎపి రాజకీయాల్లో చంద్రబాబు ఏకాకి

అమరావతి: వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపి) అధినేత నారా చంద్రబాబు నాయుడికి అంత సులభం కాదనిపిస్తోంది. గత ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకోవడమే కాకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు తీసుకున్నారు. కేవలం ఈ  కారణంగానే గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు ఓటమి పాలై తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందనేది కాదనలేని నిజం.

అయితే, ఈసారి ఆయనకు తోడు వచ్చే పార్టీ ఏదీ లేనట్లే కనిపిస్తుంది. కమ్యూనిస్టులు కూడా ఆయన పక్కన నిలబడే పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన బిజెపి, జనసేన ఇప్పుడు చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఎదురుదాడికి దిగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రధాన రాజకీయ శత్రువు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడే. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై చంద్రబాబు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. నాలుగేళ్ల పాటు స్నేహం చేసిన బిజెపి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని రాజకీయ వ్యూహరచన చేసి అమలు చేస్తోంది. పవన్ కల్యాణ్ పోరాట యాత్ర చేపడుతూ ప్రధానంగా చంద్రబాబునే లక్ష్యం చేసుకని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. చంద్రబాబుపై, ఆయన కుమారుడు నారా లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. ఆయనను ఎదుర్కోవడం చంద్రబాబుకు అంత సులభంగా కనిపించడం లేదు. 

బిజెపి నేతలు కన్నా లక్ష్మినారాయణ, సోము వీర్రాజు చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికి చంద్రబాబు చూపించిన కారణాలను తిప్పికొడుతూ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతి గురించి మాట్లాడుతున్నారు. 

వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రలో స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అదే సమయంలో చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ను ఆయన ఏమీ అనకపోవడం గమనించవచ్చు. అదే సమయంలో గతంలో జగన్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆయనను వదిలిపెట్టినట్లే కనిపిస్తున్నారు. 

వైఎస్ జగన్ గానీ, పవన్ కల్యాణ్ గానీ కేంద్ర ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు చేయడం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని మాత్రం వారిద్దరు అంటున్నారు. ప్రత్యేక హోదాను వదిలిపెట్టేది లేదని కూడా అంటున్నారు. ఇదే సమయంలో ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు వైఖరి కారణమంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. నాలుగేళ్లు బిజెపితో స్నేహం చేసి, చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడడంలో అర్థం లేదనే పద్ధతిలో వారి వ్యాఖ్యలు ఉన్నాయి. 

ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించి, ఇప్పుడు చంద్రబాబు యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా కోసం ధర్మపోరాట సభలు పెట్టడం వచ్చే ఎన్నికల కోసమేనని వారు నిందిస్తున్నారు. అదే సమయంలో అమరావతిపైనే చంద్రబాబు తన దృష్టిని కేంద్రీకరించడాన్ని పవన్ కల్యాణ్ తప్పు పడుతున్నారు. అమరావతి అభివృద్ధిపైనే చంద్రబాబు దృష్టి పెట్టి ఉత్తరాంధ్ర వంటి వెనకబడిన ప్రాంతాలను వదిలేస్తున్నారని ఆయన అంటున్నారు. 

చంద్రబాబు మూడు వైపుల నుంచి విస్తృతంగా దాడిని ఎదుర్కుంటున్నారు. ఈ స్థితిలో చంద్రబాబు రాజకీయ వ్యాఖ్యలతో వారిని ఎదుర్కునే ప్రయత్నం చేస్తున్నారు. బిజెపి చేతిలో వారిద్దరు పావులుగా మారారనేది ఆయన చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. వారి చేత బిజెపి నాటకం ఆడిస్తోందని అంటున్నారు. ధర్మపోరాట సభలు పెట్టి కేంద్ర ప్రభుత్వంపైనా, బిజెపిపైనా విరుచుకుపడడం ద్వారా ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ మహానాడులో కూడా చంద్రబాబు అదే పనిచేశారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన వివరించే ప్రయత్నం చేశారు. కానీ, కొత్తగా చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఇచ్చే హామీలు ఏవీ లేవనే విషయం అర్థమవుతోంది. అదే సమయంలో జగన్, పవన్ కల్యాణ్ ప్రాంతాలవారీగా ప్రజల సమస్యలను గురించి వాటిని తాము అధికారంలోకి వస్తే ఎలా పరిష్కరిస్తామనే విషయాన్ని చెబుతున్నారు. జగన్ ఇబ్బడి ముబ్బడిగా రాష్ట్ర ప్రజలకు వరాల వర్షం కురిపిస్తున్నారు. 

మొత్తం మీద, చంద్రబాబు రాజకీయంగా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కుంటున్నారు. ముప్పేట దాడిలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏకాకి అయినట్లు కనిపిస్తున్నారు. దాన్ని ఆయన అధిగమించడం అంత సులభమేమీ కాదు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page