గుంటూరు:  తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో పోలీస్ స్టేషన్‌లో శిరోముండనానికి గురయిన వరప్రసాద్ తనకు న్యాయం చేయాలంటూ దేశ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశాడు. ఏపి ప్రభుత్వం, పోలీసుల వల్ల తనకు న్యాయం లభించలేదని... తమరే కలుగజేసుకుని న్యాయం జరిగేలా చూడాలని కోరాడు. లేదంటే నక్సలైట్స్ లో చేరేందుకు అనుమతివ్వాలంటూ వేడుకున్నాడు. తాజాగా వరప్రసాద్ లేఖపై టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికన రియాక్ట్ అయ్యారు. 

 ''పాలకుల దుర్మార్గం, అణచివేత, అహంకారం, వివక్షత... ఇవన్నీ పెచ్చుమీరితే యువత ఎలా పక్కదారి పడుతుందో చెప్పడానికి ఈ ప్రసాద్ అనే దళిత యువకుడు ఉదాహరణ. కొద్ది రోజుల క్రితం వైసీపీ నేత ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు సీతానగరం పోలీస్ స్టేషన్లో ఇతనికి శిరోముండనం చేసి అవమానించారు''

 

''ఇంతవరకు ప్రసాద్ కు న్యాయం జరగలేదు. ఫలితంగా తాను నక్సలైట్ గా మారేందుకు అనుమతి ఇవ్వమని రాష్ట్రపతికి లేఖ రాసే పరిస్థితి వచ్చింది. ఇది తెలిసి  బాధేసింది.  ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడిలో ఇటువంటి ఆలోచన వచ్చిందంటే... రాష్ట్రంలో వ్యవస్థలు ఎంత ప్రమాదకరంగా దిగజారాయో ప్రజలు ఆలోచించాలి'' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

read more   నడిరోడ్డుపైనే వరప్రసాద్ తో కృష్ణమూర్తి ఛాలెంజ్...ఆ తర్వాతే శిరోముండనం: మాజీ మంత్రి

వైసీపీ నాయకుడి అనుచరుడి ఫిర్యాదు మేరకు వెదుళ్లపల్లిలో వరప్రసాద్ అనే దళిత యువకుడిని అరెస్ట్ చేసిన సీతానగరం పోలీసులు తీవ్రంగా కొట్టారు. అక్కడితో ఆగకుండా యువకుడికి శిరోముండనం చేశారు. తీవ్రగాయాల పాలైన అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అధికారులు ఇన్‌ఛార్జి ఎస్సైతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు.

ఇసుక లారీలు అడ్డుకున్నందుకే తనపై దాడి చేశాడని బాధిత యువకుడు ఆరోపిస్తున్నాడు. ఆ సమయంలో స్థానిక మునికూడలి వద్ద వైసీపీ నాయకుడు కవల కృష్ణమూర్తి కారుతో వచ్చి ఢీ కొట్టినట్లు బాధితుడు చెబుతున్నాడు. వెదుళ్లపల్లిలోని బాధితుడు వరప్రసాద్ ఇంటికి వెళ్లి కోరుకొండ డీఎస్పీ విచారణ చేపట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ ఆందోళన చేపట్టాయి.