అమరావతి: టీవీ9 షేర్ల కొనుగోలు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో శివాజీపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్. శివాజీ ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యుడు కాదంటూ చెప్పుకొచ్చారు. 

ప్రత్యేక హోదా సాధన సమితి నుంచి ఆయన బయటకు వెళ్లిపోయారని స్పష్టం చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకొచ్చినా ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. 

కేంద్రంలో ఏర్పడే నూతన ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా రాష్ట్రంలోని పార్టీలు షరతులతో కూడిన మద్దతు ఇవ్వాలని ఆయన సూచించారు. ఎన్నికలతో హోదా ఉద్యమానికి సంబంధం లేదన్న చలసాని హోదా సాధించేవరకూ నిరంతరం ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ అందరినీ కలుపుకుని హోదా కోసం కేంద్రంతో పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి వివిధ పార్టీలు, ప్రజలా, ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. తమిళనాడు తరహా ఉద్యమానికి కొత్త ప్రభుత్వం సిద్ధం కావాలని కోరారు. 

ఇకపోతే ప్రత్యేక హోదా సాధన సమితి పేరుతో చలసాని శ్రీనివాస్, హీరో శివాజీలు పలు పార్టీలను కలుపుకుని రాష్ట్రమంతా పర్యటించారు. అయితే ఆకస్మాత్తుగా శివాజీ మా సభ్యుడు కాదంటూ చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యానించడం ఒక్కసారిగా చర్చకు దారి తీసింది.