తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో ఇద్దరు చంద్రులకు కేంద్రప్రభుత్వం ఒకేసారి షాక్ ఇచ్చింది. ఇంతకాలం సీట్ల పెంపు విషయంలో ఏవేవో కారణాలు చెబుతున్న కేంద్రం చివరకు ప్రధానమంత్రి నరేంద్రమోడి, జాతీయ కార్యదర్శి అమిత్ షా నిర్ణయమే ఫైనల్ అని తేల్చేసింది. దాంతో ముఖ్యమంత్రులిద్దరికీ మతిపోయినంత పనైంది. ఎందుకంటే, సీట్ల పెంపు రాజకీయ నిర్ణయమన్నపుడు లాభ, నష్టాలు మాత్రమే చూస్తారు కానీ రాజ్యాంగం, చట్టం లాంటివి పట్టించుకోరు. రాష్ట్ర విభజన జరిగిన విధానం అదే అన్న విషయం అందరికీ తెలిసిందే.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు దశాబ్దాల డిమాండ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి జరగబోయే లాభమేమిటి అన్న విషయంపై ఆధారపడే అధిష్టానం రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుందన్న విషయం ఎవరినడిగానా చెబుతారు. సరే, జరిగిందేమిటన్నది వేరే సంగతి. ఇపుడుకూడా అదే జరగబోతోంది. ఎందుకంటే, ఇద్దరు చంద్రులు మంగళవారం హోంశాఖమంత్రి రాజనాధ్ సింగ్ ను కలిసి సీట్ల పెంపు విషయమై చర్చించారు. అప్పుడు వారిద్దరికీ తత్వం బోధపడింది. సీట్ల పెంపు అన్నది పూర్తిగా రాజకీయ నిర్ణయమని తమ చేతిలో ఏమీ లేదని హోమంత్రి స్పష్టం చేసారు. దాంతో చంద్రులకిద్దరికీ షాక్ కొట్టినట్లైంది.

సీట్ల పెంపు అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ఇద్దరూ ఫిరాయింపులను యధేచ్చగా ప్రోత్సహించారన్నది వాస్తవం. ఇపుడు గనుక సీట్లు పెరగకపోతే వచ్చే ఎన్నికల్లో చూడాలి వారి అవస్తలు. రెండు రాష్ట్రాల్లోనూ సీట్ల పెంపును భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తోంది. సీట్ల పెంపు వల్ల టిఆర్ఎస్, టిడిపిలకు తప్ప భాజపాకు ఉపయోగమేమీ లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు నివేదిక కూడా ఇచ్చాయి. వారి నివేదికలతో అమిత్ కూడా ఏకీభవించినట్లు సమాచారం. అందుకే సీట్ల పెంపుపై ఇద్దరు చంద్రులు కేంద్రమంత్రులతో కానీ, అమిత్ షా తో కాని ఎన్ని మార్లు చర్చించినా ఉపయోగం కనబడటం లేదు.

అయితే, ఇంతకాలం సీట్ల పెంపు విషయంలో ఏదో ఒక కారణం చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ముసుగులో గుద్దులాట అవసరం లేదనుకున్నట్లుంది. అందుకే హోంశాఖ మంత్రి ఓపెన్ అయిపోయారు. సీట్ల పెంపు విషయం తమ చేతిలో లేదని నరేంద్రమోడి, అమిత్ షాలు తీసుకోవాల్సిన రాజకీయ నిర్ణయమని తేల్చేసారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు సాధ్యం కాదని చెప్పేసినట్లే. దాంతో చంద్రులిద్దరికీ ఒకేషాక్ తగిలినట్లైంది.