న్యూఢిల్లీ: ఏపీ రాష్ట్రంలో గిరిజన యూనివర్శిటి భవన నిర్మాణాలకు రూ. 420 కోట్లను మంజూరు చేసినట్టుగా కేంద్ర మంత్రి  రమేష్ పోక్రియాల్ ప్రకటించారు. విభజన హామీలో భాగంగా ఏపీ రాష్ట్రానికి గిరిజన యూనివర్శిటిని ఏర్పాటు చేసింది.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో గురువారం నాడు  గిరిజన యూనివర్శిటికి నిధుల విషయమై  ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన గిరిజన యూనివర్శిటీ కోసం రూ. 420 కోట్లను మంజూరు చేసినట్టుగా ఆయన తెలిపారు. 

ఈ నిధులతో భవన నిర్మాణ పనులు ఊపందుకొనే అవకాశం ఉందంటున్నారు.  యూనివర్శిటీ నిర్మాణం కోసం కొత్తవలస మండలం రెల్లి గ్రామ రెవిన్యూలో రాష్ట్ర ప్రభుత్వం 525 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.

వచ్చే రెండేళ్లలో ఈ భవనాలను నిర్మించి తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని వర్శిటీ మెంటర్ జి.నాగేశ్వరరావు చెప్పారు.  ఇప్పటికే యూనివర్శిటీలో ప్రవేశం కోసం ఈ నెల 1 వ తేదీన పరీక్షలు నిర్వహించారు.  ఎనిమిది కోర్సులను నిర్వహించనున్నారు.