ఒక పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుంటే కేంద్రం మాత్రం వేగంగా పావులు కదుపుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రైవేట్ బిడ్ దాఖలు చేసేందుకు కావాల్సిన టెక్నికల్ వివరాలతో పాటు ప్లాంట్‌కు సంబంధించిన వివరాలు, లాభనష్టాలు ఇలా మొత్తం సమాచారాన్ని పంపాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించింది.

ఇప్పటికే ప్రైవేటీకరణ ప్రతిపాదన విరమించుకోవాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. అవసరమైతే బిడ్ ప్రతిపాదనలో తాము పాల్గొంటామన్నారు. అలాగే  ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఒక తీర్మానం సైతం చేస్తామని కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంది. 

Also Read:బిజెపికి ఉక్కు ప్లాంట్ సెగ: పార్టీకి కీలక నేత రాజీనామా

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలంటూ ప్రస్తుతం నగరంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు ధర్నాలు, ర్యాలీలు, దీక్షలు చేపడుతున్నాయి.

మరోవైపు ప్రైవేటీకరణ వద్దంటూ ప్రధానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ కూడా రాశారు. అయినా కేంద్రం ఇవన్నీ పట్టించుకునే పరిస్ధితుల్లో లేనట్లు తేలుస్తోంది.

ఎన్నికల ప్రక్రియ సాగుతున్న తరుణంలోనే స్టీల్‌ ప్లాంట్ ఉద్యమంపై కేంద్రం వేగంగా అడుగులు వేయడం చూస్తుంటే రాజకీయంగా తమకు దీని వల్ల ఎలాంటి నష్టం లేదనే అంచనాకు వచ్చేసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.