తాజా కేంద్రం వైఖరిపై టిడిపిలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పోలవరం, రాజధాని నిర్మాణాలకూ అనుకున్నట్లు నిధులు ఇవ్వటం లేదు. ప్రత్యేకరైల్వేజోన్ అంశాన్ని పట్టించుకోవటమే లేదు. ఇపుడు అటవీ భూముల వ్యవహారం. మిత్రపక్షమే అధికారంలో ఉన్నా కేంద్రం ఎందుకు ఇలా వ్యవహరిస్తోందో పార్టీ నేతలకు అర్ధం కావటం లేదు.
కేంద్రప్రభుత్వం చంద్రబాబునాయుడుకు గట్టి షాకే ఇచ్చింది. రాజధాని అభివృద్ధి పేరుతో 31 వేల ఎకరాల అటవీ భూములను సేకరించాలని రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తోసిపుచ్చింది. రాజధాని అభివృద్ధి పేరుతో ఇప్పటికే రైతుల నుండి 33 వేల ఎకరాలను సేకరించిన తర్వాత అదనంగా 31 వేల అటవీ భూములు ఎందుకు అంటూ ప్రశ్నించింది. దాంతో కేంద్రానికి ఏం సమాధానం చెప్పాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు.
33 వేల ఎకరాల సేకరించిన తర్వాత అదనంగా 31 వేల అటవీ భూములు సేకరించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. అందుకని అనుమతి కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. అయితే, ఇక్కడే కేంద్రం అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ విషయమై కేంద్ర-రాష్ట్రప్రభుత్వాల మధ్య చాలా కాలంగా ఉత్తరప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి లేండి. తాజాగా కేంద్ర నుండి వచ్చిన ఓ లేఖ రాష్ట్రలోని ఉన్నతాధికారులను అయోమయంలో పడేసింది.
అటవీశాఖ భూముల సేకరణకు అనుమతించే విషయంలో కేంద్రం ఓ కమిటిని పంపిస్తున్నట్లు కేంద్రం లేఖలో స్పష్టం చేసింది. దాదాపు రెండు సంవత్సరాల పాటు కేవలం లేఖలకే పరిమితమైన కేంద్రప్రభుత్వ అభ్యంతరాలు ఇపుడు కమిటిని వేయటం దాకా వచ్చింది. రాష్ట్రప్రభుత్వం రాసిన లేఖపై కేంద్రం ఓ నిపుణుల కమిటిని వేస్తోంది. కమిటి పరిశీలించి 31 వేల ఎకరాల అటవీ భూములు సేకరించాల్సిన అవసరం ఉందా అన్న విషయాన్ని తేల్చుతుంది. కమిటి నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. త్వరలో రాష్ట్రానికి రానున్న నిపుణుల కమిటీ పరిశీలన తర్వాత నాలుగు వారాల్లో నివేదిక ఇస్తుందట.
తాజా కేంద్రం వైఖరిపై టిడిపిలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పోలవరం, రాజధాని నిర్మాణాలకూ అనుకున్నట్లు నిధులు ఇవ్వటం లేదు. ప్రత్యేకరైల్వేజోన్ అంశాన్ని పట్టించుకోవటమే లేదు. ఇపుడు అటవీ భూముల వ్యవహారం. మిత్రపక్షమే అధికారంలో ఉన్నా కేంద్రం ఎందుకు ఇలా వ్యవహరిస్తోందో పార్టీ నేతలకు అర్ధం కావటం లేదు. ఒకవేళ కేంద్రం నియమించిన కమిటి గనుక అటవీ భూములు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చితే రాష్ట్రప్రభుత్వం ఏం చేస్తుందన్నది పెద్ద ప్రశ్న.
