ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చే విషయాన్ని కేంద్ర పరిశీలిస్తోందట. టిడిపి వ్యవప్ధాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు అత్యున్నత పురస్కారం భారతరత్న కు ఇచ్చే అంశం ప్రధానమంత్రి నరేంద్రమోడి పరిశీలనలో ఉన్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ఎన్టీఆర్ కు దేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ సంవత్సరాల తరబడి వినిపిస్తోంది. ‘అన్నగారి’’కి అత్యున్నత పురస్కారం రావాలని సగటు అభిమానీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాడు కానీ టిడిపి ముఖ్యులే రాజకీయం చేసేస్తున్నారు.

దేశ రాజకీయాల్లో ఓ సమయంలో ఎన్టీఆర్ చక్రం తిప్పినమాట వాస్తవం. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జాతీయస్ధాయిలో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవటంలో అన్న ఎన్టీఆర్ చేసిన కృషిని ఎవరూ మరువలేరు. అంతుకుముందు సినిప్రపంచాన్ని దశాబ్దాలపాటు ఏ స్ధాయిలో ఏలారో ఎవరూ చెప్పక్కర్లేదు.

అటువంటిది ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ఇవ్వటమన్నది సంవత్సరాల తరబడి రాజకీయమైపోవటం నిజంగా దురదృష్ణకరమే. ఇస్తే వెంటనే ఇవ్వాలి లేకపోతే లేదు. అంతేకానీ సంవత్సరాల తరబడి పేరు చుట్టూ రాజకీయం జరగటమేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎన్డీఏలో చక్రం తిప్పానని తనకు తానే చెప్పుకునే చంద్రబాబునాయుడు కూడా అదే రాజకీయాన్ని కంటిన్యూ చేస్తున్నారు.

ఇంతకీ విషయమేంటంటే ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటిస్తే సదరు పురస్కారాన్ని భార్య లక్ష్మీపార్వతి అందుకుంటుందట. ఆ విషయం చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులకు ఇష్టం లేదట. అందుకనే విషయం సంవత్సరాల తరబడి నానుతోంది. సరే, ప్రస్తుతానికి వస్తే ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ కేంద్రానికి చాలా విజ్ఞప్తులు వచ్చాయట. వాటిని కూడా ప్రధాని కార్యాలయానికి పంపినట్లు రిజుజు తెలిపారు. ప్రధాని కార్యాలయం రాష్ట్రపతికి సిఫారసు చేస్తుందట. మరి, ఎప్పటికి ఈ విషయం తేలుతుందో ఏమో?