చంద్రబాబునాయుడు ఎన్డీఏలో ఇరుక్కుపోయారు. ఎన్డీఏలో ఉండటం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు సిద్ధించటం లేదని బయటకు రాలేరు, మిత్రపక్షంగా కొనసాగలేకున్నారు. అంతలా ఎన్డీఏ చంద్రబాబును ఆడేసుకుంటోంది. మిత్రపక్షం పేరు చెప్పి అడుగడుగునా టిడిపిని ఎన్డీఏ దెబ్బ కొడుతూనే ఉంది.
చంద్రబాబునాయుడు ఎన్డీఏలో ఇరుక్కుపోయారు. ఎన్డీఏలో ఉండటం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు సిద్ధించటం లేదని బయటకు రాలేరు, మిత్రపక్షంగా కొనసాగలేకున్నారు. అంతలా ఎన్డీఏ చంద్రబాబును ఆడేసుకుంటోంది. మిత్రపక్షం పేరు చెప్పి అడుగడుగునా టిడిపిని ఎన్డీఏ దెబ్బ కొడుతూనే ఉంది. 2014 తర్వాత పెరిగిన అంచనాలతో తమకు ఎటువంటి సంబంధమూ లేదని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి చేసిన ప్రకటనతో చంద్రబాబుకు దిమ్మతిరిగింది. రాజధానికి నిధులూ మంజూరు చేయక, పోలవరం అంచనాలనూ కేంద్రం భరించక, ప్రత్యేకహోదానూ ఇవ్వక మరి రాష్ట్రాభివృద్ధికి ఎన్డీఏ ఏం చేస్తుంది?
ఏపి మాకు ఆత్మీయ రాష్ట్రమని, చాలా ప్రాధన్యత కలిగిన రాష్ట్రమని మాటలు చెప్పటం తప్ప.
మిత్రపక్షాలంటే అర్ధమేమిటి? అవసరంలో ఒకరికి మరొకరు సాయం చేసుకోవటం. కానీ ఎన్డీఏ మాత్రం మిత్రపక్షమంటే అర్ధాన్నే మార్చేస్తోంది. పేరుకే మిత్రపక్షాలు కానీ ఏపిని ఎన్డీఏ ఆదుకున్న దాఖాలు లేవు. ఎన్డీఏలో టిడిపికి కూడా సభ్యత్వముంది. కానీ ప్రతీసారి సమయం చూసి కేంద్రం రాష్ట్రప్రభుత్వాన్ని బాగానే ఇబ్బంది పెడుతోంది. మరి మిత్రపక్షం హోదాలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం పొందుతున్న లబ్ది ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.
మిత్రపక్షంగా ఏపి ప్రభుత్వం లాభపడిందాని కన్నా ఎన్డీఏ యేతర ప్రభుత్వాలు పొందిన లబ్దే ఎక్కువగా కనబడుతోంది. అందుకు తమిళనాడునే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పేరుకే చంద్రబాబునాయుడుకు భాజపా మిత్రపక్షం. కేంద్రంలో టిడిపి ఎంపిలకు రెండు మంత్రి పదవులు, రాష్ట్రంలో ఇద్దరు భాజపా ఎంఎల్ఏలకు మంత్రి పదవులు కుండమార్పిడి పద్దతిలో ఇచ్చి పుచ్చుకోవటం తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు.
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా రూ. 17 వేల కోట్ల రెవిన్యూ లోటు భర్తీ చేయలేమని చెప్పేసింది కేంద్రం. అలాగే, ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని తేల్చేసింది. చివరకు ప్రత్యేక ప్యాకేజి కూడా సాధ్యం కాదన్నది. ఎవరికీ అర్ధం కానీ ప్రత్యేక సాయమంటూ కొత్త పదాన్ని పుట్టించింది. పోనీ దానికైనా చట్టబద్దత కల్పించిందా అంటే ఇంత వరకూ లేదు. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేకరైల్వే జోన్ అంశం కూడా అటకెక్కినట్లే. ఇప్పటి వరకూ మంజూరైన విద్యాసంస్ధలు కూడా విభజన చట్టంలో పేర్కొన్నవే తప్ప కొత్తవేమీ కాదు. మిగిలిన రెండేళ్ళలో ఏపికి ఏమైనా చేస్తుందేమో చూడాలి.
