ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేకులు పడ్డట్టుగా తెలుస్తోంది. జనగణన పూర్తి కాకపోవడంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు అడ్డంకి ఏర్పడింది. జనగణన పూర్తయ్యేంత వరకు గ్రామాలు, మండలాలు, జిల్లాలు, సరిహద్దులను ఫ్రీజ్ చేయాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది.

ఆర్టీఐ ద్వారా జిల్లాల పునర్విభజన అంశం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతమున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేయాలని భావించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.

కేంద్రం నిర్ణయంతో మరో ఏడాదిన్నర వరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్ పడే అవకాశం వుందని ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కరోనా కారణంగా జనగణన పూర్తి కాలేదు. 

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సబంధించి జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన కమిటీకి ప్రభుత్వం ప్రత్యేక సబ్‌ కమిటీలు నియమించిన సంగతి తెలిసిందే.

జిల్లాల సరిహద్దులు, నియంత్రణ, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి కమిటీ- 1, నిర్మాణాత్మక, సిబ్బంది పునర్విభజన అధ్యయనానికి కమిటీ- 2, ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనానికి కమిటీ- 3, ఐటీ సంబంధిత పనుల అధ్యయనానికి సబ్‌ కమిటీ- 4 ఏర్పాటు చేశారు.