చంద్రబాబుకు కేంద్రం షాక్

First Published 23, Nov 2017, 9:03 AM IST
Center gives big jolt to Naidu over reservations issue
Highlights
  • చంద్రబాబునాయుడుకు కేంద్రం పెద్ద షాక్ ఇచ్చింది.

చంద్రబాబునాయుడుకు కేంద్రం పెద్ద షాక్ ఇచ్చింది. పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీనే రేపటి ఎన్నికల సమయంలో మెడకు చుట్టుకోవటం ఖాయంగా తెలుస్తోంది. అయినా కేంద్రం అంత సూటిగా చెబుతుందని చంద్రబాబు కూడా అనుకుని ఉండరు. అందుకనే కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనతో చంద్రబాబుకు షాక్ కొట్టినట్లైంది. ఇంతకీ జైట్లే చెప్పిందేమిటి? గుజరాత్ ఎన్నికలను ఉద్దేశించి కేంద్రమంత్రి మాట్లాడుతూ, ‘రిజర్వేషన్లు 50 శాతానికి మించి  పెంచటం కుదరదు’ అంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘ఒకవేళ రిజర్వేషన్ల శాతం పెంచాలంటే పార్లమెంట్ ద్వారా చట్టాన్ని మార్చాల్సిందే’ అని కూడా స్పష్టం చేశారు. ‘ఒకవేళ ఎవరైనా చట్టాన్ని మార్చకుండా రిజర్వేషన్లు ఇచ్చినా కోర్టు సమీక్షలో నిలబడద’ని కూడా చెప్పారు.

చంద్రబాబు ఇబ్బందుల్లో పడటానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? ఎందుకంటే, జైట్లీ గుజరాత్ విషయాన్నే ప్రస్తావించినా అదే నిబంధన ఏపికి కూడా వర్తిస్తుంది. పోయిన ఎన్నికల్లో కాపులను బిసిల్లోకి చేరుస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి అందరకీ తెలిసిందే. అయితే, అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని పక్కన పడేశారు. దాంతో ముద్రగడ కాపు ఉద్యమానికి ఊపిరిపోసారు. చివరకు ఆ ఉద్యమం కాస్త ఉధృతమై కూర్చుంది. దాంతో ఉద్యమాన్ని చల్లార్చటానకి మంజూనాథ కమిషన్ వేశారు. కమిషన్ నివేదికను ఎప్పుడిస్తుందన్నది వేరే సంగతి.

ఒకవైపు రిజర్వేషన్ల కోసం కాపులు ఉద్యమాలు చేస్తుండగానే ఇంకోవైపు కాపులను బిసిల్లోకి  చేర్చేందుకు వీల్లేదంటూ బిసిలు ఉద్యమాలు మొదలుపెట్టారు. అంటే ఒకవైపు కాపులు, ఇంకోవైపు బిసిలు ఉద్యమాలు చేస్తున్నారు. దాంతో చంద్రబాబుకు దిక్కుతోచటం లేదు. అవసరానికి తగ్గట్లు ఎక్కడి మాటలు అక్కడ చెప్పి కాలం నెట్టుకొస్తున్నారు. ఇటువంటి నేపధ్యంలోనే కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన ఖచ్చితంగా చంద్రబాబుకు షాక్ ఇచ్చేదే అనటంలో సందేహం అవసరం లేదు. ఎందుకంటే, మూడున్నరేళ్ళుగా చంద్రబాబు మాట ఏ విషయంలో కూడా కేంద్రం వద్ద చెల్లుబాటు కావటం లేదు. అటువంటిది కాపులను బిసిల్లో చేర్చే అంశంపై కేంద్రం చంద్రబాబుకు మద్దతు ఇస్తుందని అనుకునేందుకు లేదు.

అదే విషయాన్ని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, టిటిడిపి ఎంఎల్ఏ ఆర్. కృష్ణయ్య ‘ఏషియానెట్’ తో మాట్లాడుతూ ‘కాపులను బిసిల్లోకి చేర్చటాన్ని తాము ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించేది లేద’న్నారు. ‘రాజకీయాలకన్నా తమకు జాతి సంక్షేమమే ముఖ్య’మన్నారు. ‘రిజర్వేషన్ల విషయంలో జైట్లీ చెప్పిందే వాస్తవ’మన్నారు. ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు కాపులకు హామీ ఎలా ఇచ్చారో చంద్రబాబే సమాధానం చెప్పాలన్నారు.

loader