Asianet News TeluguAsianet News Telugu

ఏపీ రాజధాని కేసులో కీలక మలుపు.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్, ఈ నెల 23న విచారణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది . దీనిపై ఈ నెల 23న సుప్రీంకోర్ట్ విచారణ జరపనుంది. 

center filed affidavit in supreme court in ap capital case
Author
First Published Feb 8, 2023, 8:38 PM IST

ఏపీ రాజధాని కేసుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నెల 23న ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం ఈ మేరకు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ కేసుపై జనవరి 31న విచారణ జరగాల్సి వుంది. అయితే ఆరోజు బెంచ్ మీదకు రాలేదు. ఈ నేపథ్యంలో అమరావతిపై దాఖలైన కేసులను తక్షణమే విచారించాలని సుప్రీంకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్‌కు ఏపీ ప్రభుత్వం శనివారం లేఖ రాసింది. రాజధాని రైతు పరిరక్షణ సమితి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఈ న్యాయ పోరాటంలో గతేడాది నవంబర్ 28న విచారణ జరిగింది. దీనిని న్యాయస్థానం జనవరి 31కి వాయిదా వేసింది. అయితే 31న బెంచ్ సమావేశం కాకపోవడంతో విచారణ జరగలేదు. 

ఇదిలావుండగా.. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రతి రాష్ట్రం తన రాజధానిని నిర్ణయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా పేర్కొన్నది వాస్తవం కాదా? అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు. అలా అయితే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటి కంటే ఎక్కువ రాజధానులను ఏర్పాటు చేయకూడదని ఏపీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి యొక్క అంతరార్థం ఏమిటని అడిగారు. ఈ ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మూడు రాజధానులకు సంబంధించి చట్టం రూపొందించే సమయంలో ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని తెలిపారు. 

ALso REad: మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదు: కేంద్రం కీలక కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5, 6 ప్రకారం.. ఏపీకి కొత్త రాజధాని కోసం ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కమిటీ అవసరమైన చర్య కోసం నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపిందని చెప్పారు. ఈ క్రమంలోనే 2015 ఏప్రిల్ 23వ తేదీన “అమరావతి”ని రాజధానిగా పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. 

ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో మూడు పరిపాలన స్థానాలను కలిగి ఉండాలని పేర్కొంటూ ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (APCRDA) (రద్దు) చట్టం, 2020,  వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి (APDIDAR) చట్టం, 2020ను తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి తెలిపారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండాలని అందులో పేర్కొన్నారని చెప్పారు. అయితే ఈ చట్టాలను రూపొందించే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదని తెలిపారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..  వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి రద్దు చట్టం, 2021ని అమలులోకి తెచ్చిందని.. ఏపీసీఆర్‌డీఏ (రద్దు) చట్టం, 2020, ఏపీడీఐడీఏఆర్ చట్టం, 2020లను రద్దు  చేసిందని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios