Asianet News TeluguAsianet News Telugu

సిబిఐ సమన్లు: హైకోర్టులో సుజనా చౌదరికి చుక్కెదురు

సీబీఐ నిర్దేశించిన మే 4న కాకుండా మే 27, 28 తేదీల్లో సీబీఐ ముందు హాజరు కావాలని హైకోర్టు సుజనా చౌదరిని ఆదేశించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు బెంగళూరులోని సీబీఐ అధికారుల ముందు హాజరు కావాలని తెలిపింది.

CBI summons: Sujana Chowdhary get no releif in High Court
Author
Hyderabad, First Published May 1, 2019, 7:40 AM IST

హైదరాబాద్‌: సిబిఐ ముందు హాజరయ్యే విషయంలో హైకోర్టులో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరికి చుక్కెదురైంది.బ్యాంకు రుణాల ఎగవేత కేసులో తమ ముందు హాజరుకావాలంటూ సీబీఐ ఇచ్చిన నోటీసులను గౌరవించి తీరాల్సిందేనని హైకోర్టు ఆయనకు స్పష్టం చేసింది.. 

సీబీఐ నిర్దేశించిన మే 4న కాకుండా మే 27, 28 తేదీల్లో సీబీఐ ముందు హాజరు కావాలని హైకోర్టు సుజనా చౌదరిని ఆదేశించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు బెంగళూరులోని సీబీఐ అధికారుల ముందు హాజరు కావాలని తెలిపింది. ఆ రెండు రోజుల్లో విచారణ పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. 

మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఇవ్వాలని సూచించింది. అధికారుల విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని సుజనాకు స్పష్టం చేసింది. విచారణ సమయంలో న్యాయవాదిని సుజనా చౌదరి వెంట ఉంచుకోవచ్చని  చెప్పింది. సీఆర్పీసీ సెక్షన్‌ 160 కింద విచారణ పేరుతో సుజనా చౌదరిని అరెస్ట్‌ చేయడం గానీ, శారీరకగా, మానసికంగా వేధింపులకు గానీ గురిచేయవద్దని ఆదేశించింది. 

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. సీబీఐ తనకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరుతూ సుజనా చౌదరి సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ విచారణ జరిపారు.
 
సుజనా చౌదరి వేసిన పిటిషన్ పై హైకోర్టు ముందు సీబీఐ న్యాయవాది తరఫున కె.సురేందర్‌ వాదించారు. సీఆర్‌పీసీ సెక్షన్‌160, 161 కింద నోటీసులు ఇచ్చినప్పుడు, విచారణను ఎదుర్కోవడానికి నిరాకరించడానికి వీల్లేదని అన్నారు. సుజనా గ్రూపు కంపెనీల వ్యవహారాలకు సంబంధి చి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. కాగితాలపైనే లావాదేవీలు చూపినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని, అందుకే పిటిషనర్‌కు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశామని తెలిపారు. 

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. చెన్నైకి చెందిన బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజ్టెక్ట్స్‌ కంపెనీకి కానీ, ఆ కంపెనీ అధికారులతో కానీ సుజనా చౌదరికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తనకు ఇచ్చిన నోటీసులకు సంబంధించి సీబీఐని పిటిషనర్‌ మరింత సమాచారం, అలాగే ఎఫ్‌ఐఆర్‌ కాపీ కోరుతూ లేఖ రాశారని గుర్తు చేశారు. అయితే సీబీఐ నుంచి ఎటువంటి స్పందన రాలేదని అన్నారు. ఎన్నికల దృష్ట్యా మే 19వ తేదీ వరకు అందుబాటులో ఉండలేనని సీబీఐకి చెప్పారని ఆయన అన్నారు.  

సంబంధిత వార్తలు

సిబిఐకి సుజనా చౌదరి టోకరా: అరెస్టు భయమేనా...

సీబీఐ ఎఫెక్ట్: బెంగుళూరుకు సుజనా చౌదరి

సుజనా చౌదరికి సీబీఐ షాక్: విచారణకు హాజరవ్వాల్సిందిగా సమన్లు

Follow Us:
Download App:
  • android
  • ios