వివేకా హత్య కేసు.. వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరోసారి విచారణకు రావాల్సిందిగా వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీచేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరోసారి విచారణకు రావాల్సిందిగా వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీచేశారు. పులివెందులలోని అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు. సోమవారం(మార్చి 6) రోజున విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని తెలిపారు. అయితే ఈ నోటీసులపై స్పందించిన అవినాష్ రెడ్డి.. తాను సోమవారం విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు రిప్లై ఇచ్చారు. అయితే సోమవారం కచ్చితంగా విచారణకు రావాల్సిందేనని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 12న విచారణకు హాజరుకావాల్సిందిగా భాస్కర్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీచేయగా.. తాజాగా ఈ నెల 6వ తేదీనే విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులకు ఆయనకు సూచించారు.కడపలోనే విచారణకు హాజరుకావాల్సిందిగా తెలిపారు.
ఇక, ఈ కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు రెండుసార్లు విచారించారు. ఈ ఏడాది జనవరి 28న మొదటిసారి అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించగా.. ఫిబ్రవరి 24న మరోసారి ఆయనను అధికారులు ప్రశ్నించారు. రెండోసారి సీబీఐ విచారణ అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను సీబీఐకి సహకరించానని చెప్పారు. సీబీఐ అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసినంతవరకు సమాధానం చెప్పానని తెలిపారు. జాగ్రత్తగా వార్తలు ప్రసారం చేయాలని మీడియాను కోరారు. తాను విజయమ్మను కలిస్తే బెదిరించి వచ్చానని కొందరు డిబేట్లు పెట్టి ప్రచారం చేశారని మండిపడ్డారు. తాను దుబాయ్‌కి పారిపోయానని ఒక వర్గం దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. అటువంటి వార్తల్లో ఎటువంటి నిజం లేదన్నారు.
కేసు విచారణ జరుగుతన్న సమయంలో మీడియా చేసే ఇలాంటి చర్యల వల్ల విచారణపై ఏ విధమైన ప్రచారం పడుతుందో ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. ఒక అబద్దాన్ని 0 నుంచి 100కు.. ఒక నిజాన్ని 100 నుంచి 0 చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. వాస్తవాలు లక్ష్యంగా కాకుండా వ్యక్తి లక్ష్యంగా విచారణ జరుగుతుందని చెప్పారు. వివేకానందరెడ్డి మరణించిన సమయంలో దొరికిన లేఖను బహిర్గతం చేయాలని సీబీఐని కోరినట్టుగా చెప్పారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరుతూ తనకు తెలిసిన వాస్తవాలతో సీబీఐకి వినతి పత్రం అందించినట్లు తెలిపారు.
గూగుల్ టేక్అవుట్ అంటున్నారని.. అది గూగుల్ టేక్అవుటా? లేదా టీడీపీ టేక్అవుటా? అనేది భవిష్యత్తులో తేలుతుందని అన్నారు. సీబీఐ కౌంటర్ అఫిడవిట్లో చెప్పిన విషయాన్ని టీడీపీ ఏడాది క్రితమే ఎలా చెప్పిందని ప్రశ్నించారు. గత విచారణ సందర్భంగా మరోసారి రావాల్సి ఉంటుందని అధికారులు చెప్పారని.. ఈసారి అలా ఏం చెప్పలేదని అవినాష్ రెడ్డి తెలిపారు.
ఇక, గతంలో ఫిబ్రవరి 23న విచారణకు హాజరుకావాలని వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే తాను 23వ తేదీన విచారణకు హాజరుకాలేనని భాస్కర్ రెడ్డి సీబీఐ అధికారులకు సమాచారం అందజేశారు. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు మరోమారు భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీచేశారు.