కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడును పెంచింది. గురువారంనాడు చెప్పుల షాపు యజమాని సహా మరో నలుగురిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

2019 మార్చి15న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు. తన ఇంట్లోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురికావడం రాష్ట్ర వ్యాప్తంగా కలకం రేపింది.

ఈ విషయమై సీబీఐ విచారణ కోరుతూ వివేకా కుటుంబసభ్యులతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవీంద్ర, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఆధారంగా సీబీఐ విచారణకు ఈ ఏడాది మార్చి 11న  హైకోర్టు ఆదేశించింది.

వైఎస్ వివేకానందరెడ్డితో ఆర్దిక లావాదేవీలు  కలిగి ఉన్న చెప్పుల షాపు యజమాని మున్నాను రెండో రోజు కూడ సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. బుధవారం నాడు కూడ మున్నాను సీబీఐ విచారించింది.

 బుధవారం నాడు మున్నాను విచారించడంతో పాటు ఆయన లాకర్ ను సీబీఐ అధికారులు పరిశీలించారు. సీబీఐ అధికారుల విచారణలో మున్నా లాకర్ లో భారీగా నగదు, బంగారాన్ని సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.మున్నాతో పాటు ఓ మహిళా, హిజ్రా సహా నలుగురు వ్యక్తులు సీబీఐ విచారణకు హాజరయ్యారు.