అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష కోట్లు అవినీతి ఆరోపణలపై సీబీఐ మాజీ జేడీ, విశాఖపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ స్పందించారు. వైఎస్ జగన్ లక్ష కోట్లు దోచుకున్నారనేది రాజకీయ ఆరోపణలు అని అవి తనకు సంబంధం లేదన్నారు. 

ఆనాడు సీబీఐ జేడీగా చేసిన దర్యాప్తులో రూ.1500 కోట్లు అవకతవకలు జరిగినట్లు గుర్తించానని అవే చార్జీషీట్లో పేర్కొన్నానని తెలిపారు. ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జేడీ లక్ష కోట్లు దోపిడీ జరిగిందని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై సమాధానం దాటవేశారు. 

రాజకీయ ఆరోపణలను తాను బాధ్యుడ్ని కాద‌ని, వాటిని తాను ఖండించలేనని చెప్పుకొచ్చారు. జగన్ కేసులను కొందరు నేత‌లు రాజకీయంగా వాడుకుని ఉంటే అందుకు తానేమీ చేయలేనని స్పష్టం చేశారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.