విశాఖ : సీబీఐ వలకు చిక్కిన అవినీతి తిమంగలం... సోదాల్లో రూ.1.86 కోట్ల నగదు గుర్తింపు
కేంద్ర వ్యవసాయ శాఖలో మొక్కల సంరక్షణ అధికారిగా పనిచేస్తున్న ఆర్ పదంసింగ్ లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. విశాఖ, కాకినాడతో పాటు ఉత్తరాఖండ్‌లోనూ నిర్వహించిన తనిఖీల్లో రూ.1.86 కోట్ల నగదు దొరికినట్లుగా తెలుస్తోంది.
విశాఖ జిల్లాలో సీబీఐ వలలో అవినీతి తిమంగలం పడింది. కేంద్ర వ్యవసాయ శాఖలో మొక్కల సంరక్షణ అధికారిగా పనిచేస్తున్న ఆర్ పదంసింగ్.. వివిధ పత్రాల మంజూరు కోసం భారీగా లంచాలు తీసుకుంటున్నారని సీబీఐకి సమాచారం అందింది. దీంతో ఆయనపై నిఘా పెట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ .. శనివారం విశాఖలోని కార్యాయలంలో రూ.6 వేలు లంచం తీసుకుంటుండటా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. విశాఖ, కాకినాడతో పాటు ఉత్తరాఖండ్‌లోనూ సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.1.86 కోట్ల నగదు దొరికినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇకపోతే.. ఈ నెల 1న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణలోని జల్‌పల్లి మున్సిపల్ కమీషనర్ జీపీ కుమార్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో రూ.50 కోట్ల మేర అక్రమ ఆస్తులు గుర్తించింది ఏసీబీ. ఈ నేపథ్యంలో అక్రమాస్తుల కేసులో జీపీ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. జీపీ కుమార్ ఆఫీసు, నివాసం సహా 8 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రూ.5 లక్షల లంచం కేసులో ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయగా ఆయన అవినీతి బండారం బయటపడింది.
తనిఖీల్లో జీపీ కుమార్ బ్యాంక్ లాకర్లలో భారీగా నగదు, నగలు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు, కోల్డ్ స్టోరీజీ బిజినెస్ లు ఆయన నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. భార్య పేరుపై రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినట్లుగా నిర్ధారించారు. ఈ అభియోగాలపై జీపీ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఏసీబీ అధికారులు. గతంలో మంత్రి వద్ద పీఏగా పనిచేశారు కుమార్.