జల్‌పల్లి మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్ అక్రమాస్తులు కూడబెట్టారని ఏసీబీ అధికారులు గుర్తించారు. సుమారు రూ. 50 కోట్లకు పైగా జేపీ కుమార్ ఆస్తులు కూడబెట్టారని తెలుగు న్యూస్ మీడియా చానెల్ ప్రసారం చేసింది. జీపీ కుమార్ భార్య పేరున ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జల్‌పల్లి మున్సిపల్ కమీషనర్ జీపీ కుమార్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న తనిఖీల్లో రూ.50 కోట్ల మేర అక్రమ ఆస్తులు గుర్తించింది ఏసీబీ. ఈ నేపథ్యంలో అక్రమాస్తుల కేసులో జీపీ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. జీపీ కుమార్ ఆఫీసు, నివాసం సహా 8 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రూ.5 లక్షల లంచం కేసులో ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయగా ఆయన అవినీతి బండారం బయటపడింది.
తనిఖీల్లో జీపీ కుమార్ బ్యాంక్ లాకర్లలో భారీగా నగదు, నగలు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు, కోల్డ్ స్టోరీజీ బిజినెస్ లు ఆయన నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. భార్య పేరుపై రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినట్లుగా నిర్ధారించారు. ఈ అభియోగాలపై జీపీ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఏసీబీ అధికారులు. గతంలో మంత్రి వద్ద పీఏగా పనిచేశారు కుమార్.
ALso Read:జల్‌పల్లి మున్సిపల్ కమిషనర్ జేపీ కుమార్ ఇంట్లో సోదాలు: అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ
కాగా.. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు గత కొన్నిరోజులుగా దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. లంచం తీసుకుంటూ పలువురు అధికారులు ఏసీబీకి చిక్కారు. మరికొందరు అధికారులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఘట్ కేసర్ సబ్ రిజిస్ట్రార్ సీతారాంను ఈ ఏడాది జూన్ 7న ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రూ. 70 వేలు అంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ అధికారులకు చిక్కాడంతో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఘట్ కేసర్ మండలంలోని అవుషాపూర్ గ్రామంలో గ్రామ కంఠానికి చెందిన రెండు ఫ్లాట్స్ ను రిజిస్ట్రేషన్ చేసేందుకు రిజిస్ట్రార్ సీతారాం లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కాడు. సుదర్శన్ అనే వ్యక్తి నుండి సీతారాం లంచం తీసుకున్నాడు.
అలాగే హైద్రాబాద్ నగరంలోని శంషాబాద్ లో సంగారెడ్డి మండల పంచాయితీ అధికారి సురేందర్ రెడ్డి ఇంట్లో ఈ ఏడాది మే 12న ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సురేందర్ రెడ్డికి భారీగా అక్రమాస్తులు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. సురేందర్ రెడ్డి ఇంట్లో సుమారు కోటి రూపాయల నగదును కూడా ఏసీబీ సీజ్ చేశారు. సురేందర్ రెడ్డి ఇంట్లో ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. కోటి రూపాయాల విలువైన విల్లా, రూ. 43.80 లక్షల ఓపెన్ ప్లాట్, రూ. 8.11 లక్షల విలువైన వ్యవసాయ భూమి, 129.2 తులాల గోల్డ్ ను ఏసీబీ అధికారులు సీజ్ చేశారని సమాచారం. శంషాబాద్ లో పంచాయితీ అధికారిగా పనిచేసిన సురేందర్ రెడ్డి అక్రమాలకు పాల్పడినట్టుగా పలుఆరోపణలున్నాయి. సురేందర్ రెడ్డి ఇంట్లో దొరికిన ఆస్తుల విలువ రూ. 20 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు వివరించారు.
