దేవుడి మాన్యం భూమిలో పంటను నాశనం చేసారని ఓ దళిత కుటుంబాన్ని వెలివేసిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది.  

గుంటూరు : ప్రపంచంమొత్తం ఆధునీకత వైపు పరుగుతీస్తుంటే దేశంలోని కొన్నిప్రాంతాల్లో ఇంకా ఆటవిక విధానాలే అమలవుతున్నాయి. ముఖ్యంగా అంటరానితనం, కుల వివక్షత వంటి సామాజిక అంతరాలు గ్రామాల్లో తొలగిపోలేదు. ఇప్పటికీ ఆదిపత్య కులాలు దళితులను గ్రామ బహిష్కరణ, సామాజిక వెలివేత చేస్తున్న అనేక ఘటను వెలుగుచూస్తూనే వున్నాయి. అయితే గుంటూరు జిల్లాలో విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఓ దళిత కుటుంబాన్ని దళిత సమాజమే కుల బహిష్కరణ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా మట్టిచెరుకూరు మండలం కోర్నెపాడు గ్రామానికి చెందిన చిలక ఏసురత్నం సన్నకారు రైతు. వ్యవసాయం మాత్రమే తెలిసిన అతడు ఎకరం భూమిలోనే పంటలు పండించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఇటీవల కురిసిన వర్షాలతో తన పొలంలో పిచ్చిమొక్కలు మొలవడంతో వాటిని తొలగించడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆ రైతు పొలంలో గడ్డి నివారణ మందును పిచికారి చేసాడు. 

వీడియో

అయితే ఏసురత్నం పిచ్చిమొక్కల నివారణకు పిచికారీ చేసిన గడ్డిమందు గాలికి పొలంపక్కనే వున్న దేవుడి మాన్యంలోని పంటపై పడింది. అందులోని పత్తిపంట కొంతమేర దెబ్బతింది. దీంతో ఆ భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తున్న చిలకా సురేష్ ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలిపాడు. తన పంటను నాశనం చేసిన ఏసురత్నం నుండి నష్టపరిహారం ఇప్పించాలని కోరాడు. దీంతో కుల పెద్దలంతా కలిసి పంచాయితీ పెట్టి ఏసురత్నం రూ.15వేలు సురేష్ కు నష్టపరిహారంగా ఇవ్వాలని తీర్మానించారు. 

Read More ఇద్దరు బిడ్డలతో కలిసి అత్తింటిముందు కూర్చుని... భర్త కోసం మహిళ ఆందోళన (వీడియో)

పంచాయితీ పెద్దల తీర్పు న్యాయంగా లేదని... పంటనష్టం అంతగా జరగలేదని ఏసురత్నం వాపోయాడు. అతడి మాటలు కులపెద్దలు వినిపించుకోకపోవడంతో ఆ దేవుడి ముందు ఈ నష్టపరిహారం డబ్బులు పెడతానని... అక్కడి నుండి తీసుకోవాలని సూచించాడు. దీంతో తమ తీర్పును వ్యతిరేకిస్తున్నాడంటూ ఏసురత్నం కుటుంబాన్ని కులం నుండి వెలివేస్తున్నట్లు పెద్దలు ప్రకటించారు. వారికి గ్రామస్తులు శుభకార్యాలకు పిలవకూడదని... కిరాణా షాప్స్, హోటళ్ల వద్దకు రానివ్వకూడదని హెచ్చరించారు. ఇలా కుల పెద్దలు అమానుషంగా వ్యవహరించడంతో ఏసురత్నం కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురవుతోంది. 

బాధిత కుటుంబం తమకు జరిగిన అవమానం, అమానుష తీర్పు గురించి బయటపెట్టారు. దీంతో ఈ ఆధునిక యుగంలో ఆటవికంగా ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ విధించిన వ్యవహారం బయటపడింది. తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధిత కుటుంబం కోరుతోంది.