ఫిరాయింపు మంత్రుల పై కోర్టులో పిటీషన్ దాఖలైంది. వైసీపీ నుండి టిడిపిలోకి ఫిరాయించిన ఎంఎల్ఏల్లో నలుగురు మంత్రి పదవులు తీసుకోవటం రాజ్యాంగానికి విరుద్ధమంటూ ఓ పాత్రికేయుడు తంగెళ్ళ శివప్రసాద రెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. పిటీషన్ను ఈరోజు ధర్మాసనం విచారణకు స్వీకరిస్తోంది. ఫిరాయింపు ఎంఎల్ఏలు అఖిలప్రియ, అమరనాధరెడ్డి, ఆదినారాయణరెడ్డి, సుజయకృష్ణ రంగారావులను మంత్రులుగా నియమించటం రాజ్యాంగ విరుద్ధమంటూ రెడ్డి తన పిటీషన్లో పేర్కొన్నారు. తన పిటీషన్లో ఫిరాయింపు మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైఎస్ఆర్సిపి అధ్యక్షుడుని ప్రతిదాలుగా పేర్కొన్నారు. చంద్రబాబునాయుడుని ప్రతివాదిగా చేర్చకపోవటం గమనించాలి.

ఓ వ్యక్తిని మంత్రి కాకుండా రాజ్యాంగం నిషేధించినపుడు ముఖ్యమంత్రి సూచనలను గవర్నర్ పాటించాల్సిన అవసరం లేదని పిటీషనర్ స్పష్టం చేసారు. పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు చట్ట సవరణ చేసినా ఆగటం లేదని వాపోయారు. చట్టాన్ని కఠినంగా అమలు చేయలేకపోవటమే ఇందుకు నిదర్శనంగా రెడ్డి అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ప్రకారం పై నలుగురు ఫిరాయింపుదారులు మంత్రులుగా అనర్హులంటూ రెడ్డి చెప్పటం గమనార్హం. ఈ విషయలో కోర్టే జోక్యం చేసుకోవాలంటూ పిటీషనర్ విజ్ఞప్తి చేసారు.