విశాఖపట్నం నగరంలో మంగళవారం అర్ధరాత్రి ఓ ఇన్నోవా కారు బీభత్సం సృష్టించింది. రామాటాకీస్‌ వైపు నుంచి సిరిపురం వైపు వెళ్తున్న ఈ కారు వీఐపీ రోడ్డులో ప్యారడైజ్‌ హోటల్‌ సమీపంలో పార్కింగ్‌ చేసి ఉన్న బైక్‌లను ఢీకొట్టింది.

విశాఖపట్నం నగరంలో మంగళవారం అర్ధరాత్రి ఓ ఇన్నోవా కారు బీభత్సం సృష్టించింది. రామాటాకీస్‌ వైపు నుంచి సిరిపురం వైపు వెళ్తున్న ఈ కారు వీఐపీ రోడ్డులో ప్యారడైజ్‌ హోటల్‌ సమీపంలో పార్కింగ్‌ చేసి ఉన్న బైక్‌లను ఢీకొట్టింది. ఫుట్‌పాత్‌‌పై ఉన్న ఓ చెట్టును ఢీకొని ఆగిపోయింది. అయితే కారు ముందు భాగం చెట్టు మీదకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 8 బైక్‌లు ధ్వంసం అయ్యాయి. కారు ముందు భాగం కూడా దెబ్బతింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని వారు అక్కడి నుంచి పారిపోయారు. అయితే కారు డ్రైవ్ చేసింది ఓ మహిళ అని.. ఆమె వైద్యురాలిగా పనిచేస్తున్నారని.. మద్యం మత్తులో ఉండటంతోనే ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. 

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ ఘటనపై ప్రస్తుతం త్రీ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. కారును కూడా అక్కడి నుంచి తొలగించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగం అధికంగా ఉందని.. ప్రమాదం జరిగిన తర్వాత కారులోని వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన చోటు మనుషులు ఉండి ఉంటే.. ప్రాణనష్టం జరిగి ఉండేందని.. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని పేర్కొంటున్నారు.