తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు తప్పిన పెను ప్రమాదం

Car catches fire in parking lot at Tirumala temple
Highlights

టిటిడి అధికారుల అప్రమత్తతతో...

తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు పెను ప్రమాదం తప్పింది. ఆలయానికి అత్యంత సమీపంలో ఉన్న కారు పార్కింగ్  ఏరియాలో ఓ కారు అగ్గికి ఆహుతైంది. అయితే ఈ ప్రమాదం శ్రీవారి ఆలయ సమీపంలో జరగడంతో టిటిడి అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం కానీ సంభవించలేదు.

ఈ ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇవాళ ఉదయం టిటిడి విజిలెన్స్ డీఎస్పీ అంకయ్య శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో ఆయన తన కారుని పార్కింగ్ స్థలంలో ఉంచి ఉదయం జరిగే అభిషేకంలో పాల్గొనడానికి వెళ్లారు. అయితే పార్కింగ్ లోని కారులో హటాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు భారీ ఎత్తున ఎగిసిపడటం, ప్రధాన ఆలయం సమీపంలోనే ఈ ఘటన జరగడంతో టిటిడి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. 

ఈ ఘటనపై అధికారుల నుండి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కారు బ్యాటరీలో లోపం వల్ల షాట్‌ సర్క్యూట్‌ జరిగినట్లు తెలుస్తోంది. సకాలంలో మంటలను అదుపులోకి వచ్చి ప్రమాదం తప్పడంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో పాటు టిటిడి అధికారులు,సిబ్బంది ఊపిరి తీసుకున్నారు.


 

loader