జగన్ కు అనంతపురం చాలా కీలకం

Can ys jagan make padayatra success in anantapuram Dt
Highlights

  • మొత్తానికి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కీలకమైన అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు.

మొత్తానికి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కీలకమైన అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పటికి రెండు జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేశారు. నవంబర్ 6వ తేదీ కడప జిల్లాలో పాదయాత్రను మొదలుపెట్టిన జగన్ సోమవారం కర్నూలు జిల్లాను పూర్తి చేస్తున్నారు. 26వ రోజుకు కర్నూలు-అనంతపురం జిల్లాల సరిహద్దు గ్రామమైన బసినేపల్లి గుండా అనంతపురం జిల్లా గుత్తిలోకి ప్రవేశించారు.  పై రెండు జిల్లాల్లో కలిపి జగన్ 356 కిలోమీటర్లు నడిచారు. ఇందులో కర్నూలు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకర్గాల్లో 240 కిలోమీటర్లు కాగా అంతకుముందు కడప జిల్లాలో 116 కిలోమీటర్లు నడిచారు.

హోలు మొత్తం మీద జగన్ పాదయాత్ర ఇప్పటి వరకూ బాగా జరిగిందనే చెప్పాలి. కడప సొంత జిల్లా కాబట్టి జనాలు బాగానే వచ్చారని అనుకున్నారు. మరి, కర్నూలు జిల్లాలో అంతకన్నా బాగా వచ్చారన్నది నిజం. కర్నూలు జిల్లా యాత్రలో జగన్ ప్రధానంగా ఫిరాయింపులు, టిడిపి నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టారు. జిల్లాలో పాదయాత్ర చేసిన 7 నియోజకవవర్గాల్లో ఆళ్ళగడ్డ, కోడుమూరు ఫిరాయింపు నియోజకవర్గాలు కాగా, బనగానపల్లి, పత్తికొండ, ఎమ్మిగనూరు టిడిపి నియోజకవర్గాలు. మిగిలిన ఆలూరు, డోన్ వైసిపివి.

 

ఫిరాయింపులు, టిడిపి నియోజకవర్గాల్లో అన్నింటిలోకి పత్తికొండ, బనగానపల్లి, కోడుమూరులో జనాలు విపరీతంగా హాజరయ్యారు. మళ్ళీ వీటిల్లో కూడా పత్తికొండ హైలైట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే, పత్తికొండ ఉపముఖ్యమంత్రి రెవిన్యూశాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి నియోజకవర్గం కావటంతో పాటు వైసిపి ఇన్చార్జి చెఱుకులపాడు నారాయణరెడ్డి హత్య జరిగిన నియోజకవర్గం కావటంతో ప్రధాన్యత పెరిగింది. అందులోనూ నారాయణరెడ్డి భార్య శ్రీదేవీరెడ్డిని జగన్ అభ్యర్ధిగా ప్రకటించటంతో స్పందన మరింత పెరిగింది.

సరే, పై రెండు జిల్లాల్లో పాదయాత్ర సక్సెస్ విషయం పక్కనబెడదాం. సోమవారం ఉదయానికి జగన్ అనంతపురం జిల్లాలోని గుత్తి నియోజకవర్గంలోకి ప్రవేశించారు. అంటే దాదాపు మరో 15 రోజులు జగన్ ఈ జిల్లాలోనే పర్యటిస్తారు. ఇక్కడి జనాల ఆధరణ ఎలాగుంటుందన్నది చూడాలి. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కదిరి, ఉరవకొండ నియోజకవర్గాల్లో మాత్రమే వైసిపి గెలిచింది. అయితే, కదిరి ఎంఎల్ఏ అత్తార్ చాంద్ భాష టిడిపిలోకి ఫిరాయించారు. ఉరవకొండ ఎంఎల్ఏ విశ్వేశ్వర్ రెడ్డే జిల్లాయాత్ర బాధ్యతలు దగ్గరుండి చూసుకుంటున్నారు. కాబట్టే జగన్ పాదయాత్రపై అందరిలోనూ ఆశక్తి మొదలైంది.

 

loader