ఎంతమంది టిడిపి ఎంఎల్ఏలను ప్రజలు మెచ్చారన్నది పెద్ద ప్రశ్న.
ప్రజలను మెప్పిస్తే గానీ ఓట్లు పడవన్న మాటలు టిడిపికీ వర్తిస్తాయా? అసెంబ్లీలో చంద్రబాబునాయుడు వైసీపీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, రౌడీయిజాన్ని కోరుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలను మెప్పిస్తేనే ప్రజలుల మెచ్చి ఓట్లు వేస్తారని లేకపోతే ఒక్కరికి కూడా డిపాజిట్లు రావంటూ శాపనార్ధాలు పెట్టారు. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. ఎంతమంది టిడిపి ఎంఎల్ఏలను ప్రజలు మెచ్చారన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే, చంద్రబాబు చేయించుకుంటున్న సర్వేల్లోనే చాలామంది ఎంఎల్ఏలకు పూర్ ర్యాంకే వచ్చింది. తమ వ్యవహారశైలితో ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకుంటున్నట్లు స్వయంగా చంద్రబాబే చెప్పారు.
అదేవిధంగా పలువురు మంత్రులు కూడా నియోజకవర్గాల్లో ప్రజలకూ అందుబాటులో లేకుండా, జిల్లాలో నేతలకూ అందుబాటులో లేకుండా ఏం చేస్తున్నారంటూ నిలదీసారు. అంటే అర్ధం అటువంటి మంత్రులను కూడా ప్రజలు మెచ్చరనే కదా అర్ధం? ఎంఎల్ఏలకూ పూర్ ర్యాంకింగ్ వచ్చి, మంత్రులూ ప్రజలకు అందుబాటులో లేకుంటే మరి ప్రజలు ఎంతమందిని గెలిపిస్తారు? వైసీపీ అభ్యర్ధుల్లో ఎందరికి డిపాజిట్లు వస్తాయన్న విషయాన్ని పక్కనబెడితే, చంద్రబాబు లెక్కల ప్రకారమే వచ్చే ఎన్నికల్లో టిడిపి తరపున గెలిచే ఎంఎల్ఏలు ఎందరు?
ఇక, అధికారులపైన, జనాల పైన ఎంఎల్ఏలు, నేతలు చేస్తున్న దాడులు, దాష్టికాలకు కొదవేలేదు. అవినీతి, అక్రమాల గురించైతే చెప్పనే అక్కర్లేదు. అవినీతి ఆరోపణలు లేని మంత్రుల సంఖ్యే చాలా తక్కువ. లీకవుతున్న ఎంఎల్ఏల బెదిరింపుల ఫోన్లకైతే కొదవేలేదు. ఇపుడు చెప్పండి చంద్రబాబు, మీ ఎంఎల్ఏల్లో ఎంతమందిని ప్రజలు మెచ్చుతారో? ఎంతమందికి డిపాజిట్లు వస్తాయో?
