అఖిలప్రియపై చర్యలు తీసుకుంటారా?

First Published 13, Nov 2017, 7:19 PM IST
Can lokesh take action on big people who are responsible for the boat mishap
Highlights
  • ‘ఇబ్రహింపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాదం ఘటనలో తప్పు ఎవరిదైనా కఠిన చర్యలు తీసుకుంటాం’...ఇవి తాజాగా మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటన.

‘ఇబ్రహింపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాదం ఘటనలో తప్పు ఎవరిదైనా కఠిన చర్యలు తీసుకుంటాం’...ఇవి తాజాగా మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటన. ప్రకటన వరకూ బాగానే ఉంది కానీ ఎవరిపై చర్యలు తీసుకుంటారన్నదే ప్రశ్న. ఎందుకంటే, అనుమతి లేని బోటు నదిలో తిరగటానికి కారణం అధికారపార్టీ నేతలే అన్నది తాజాగా వినిపిస్తున్న ఆరోపణలు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రిది ప్రముఖ పాత్రట. అనధికారికంగా జరుగుతున్న ప్రచారం ప్రకారం నదిలో దాదాపు 30 వరకూ బోట్లు అనుమతులు లేకుండానే తిరుగుతున్నాయి.

ఇన్ని బోట్లు అనుమతులు లేకుండానే తిరుగుతున్నాయంటే అధికార పార్టీలోని ప్రముఖుల అండదండలు లేకుండానే సాధ్యమవుతాయా? అంతెందుకు నెల రోజుల క్రితం ఇదే బోటును పర్యాటక శాఖ అధికారులు నిలిపేస్తే ఓ మంత్రి జోక్యం చేసుకుని బోటును నదిలో తిరేగేట్లు చేసారట. అంతకన్నా ఘోరమేంటంటే, ఇదే బోటు వ్యాపారంలో నలుగురు ఉన్నతాధికారులకు భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.

ఇక, గుంటూరు జిల్లా పొన్నూరు టిడిపి ఎంఎల్ఏ దూళిపాళ నరేందర్ మాట్లాడుతూ, అనధికారికంగా బోటు తిరగటంలో ఉన్నతాధికారులదే పాత్ర ఉన్నట్లు ఆరోపించారు. అన్నింటికన్నా మించి పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ చేతకాని తనం స్పష్టంగా బయటపడింది. మంత్రిగా బాధ్యతలు తీసుకుని దాదాపు ఏడాది దాటినా ఇప్పటికీ శాఖపై పట్టు రాలేదంటే మంత్రి ఎంత గొప్పగా పనిచేస్తోందో అర్ధమైపోతోంది.

నిజంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటే ముందు అఖిలప్రియ మీదే తీసుకోవాలి. తర్వాత అనుమతి లేకపోయినా నదిలోకి బోటు దిగటానికి కారణమైన మరో మంత్రిపైన, చివరగా ఉన్నతాధికారులపైనే చర్యలు తీసుకోవాలి. మరి, లోకేష్ ఇంతమందిపై చర్యలు తీసుకోగలరా ?

loader