గతంలో కూడా తునిలో రైలు దహనం ఘటన జరిగింది. రాజధాని ప్రాంతంలోని రైతుల పొలాలు తగలబడ్డాయి. పై రెండు ఘటనల్లోనూ చంద్రబాబునాయుడుతో పాటు మంత్రులు జగన్మోహన్ రెడ్డి హస్తముందంటూ ఎన్నో ఆరోపణలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ చివరకి ఏమైంది? పై ఘటనల్లో అసలు జగన్ హస్తమే లేదని తేలిపోయింది.
ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దేశద్రోహ నేరం కేసు పెట్టాలని ప్రభుత్వం చూస్తున్నట్లుంది. ‘డల్లాస్ మెయిల్స్’ వెనుక వైసీపీ అధ్యక్షుడు జగన్ ఉన్నారంటూ ఇప్పటికే పలువురు మంత్రులు ఆరోపణలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే కదా? ఇందులో భాగంగానే సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులతో పాటు పలువురు మంత్రులు మాట్లుడుతూ, జగన్ పై దేశద్రోహ నేరం కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకాలం చంద్రబాబు, ప్రభుత్వంపై దాడి చేస్తున్నా సహించామని అయితే, విదేశీ గడ్డపై రాష్ట్రప్రభుత్వం పరువు తీసేందుకు కూడా సిద్ధపడిన తర్వాత ఉపేక్షించకూడదంటూ మంత్రులు గట్టిగా అనుకుంటున్నారు.
డల్లాస్ లోని ఇర్వింగ్ పోలీసులకు చంద్రబాబుకు వ్యతిరేకంగా మెయిల్స్ ఇవ్వటం వెనుక ఆరుగురిని గుర్తించినట్లు కాల్వ చెబుతున్నారు. వారందరికీ వైసీపీతో సంబంధాలున్నట్లు మంత్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరుగురు గతంలో సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులను కూడా విశ్లేషిస్తున్నట్లు మంత్రులు చెప్పారు.
ఇంత చెప్పిన మంత్రులు గుర్తించిన ఆరుగురికి వైసీపీతొ సంబంధాలున్నాయని కానీ వారంతా వైసీపీ వారేనని కానీ ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. కేవలం అనుమానం అని చెబుతూనే జగన్ పై దేశద్రోహ నేరం మోపాలని మాత్రం డిమాండ్ చేస్తుండటం గమనార్హం. పైగా ఇర్వింగ్ పోలీసులకు అందిన మెయిల్స్ వెనుక జగన్, విజయసాయిరెడ్డి హస్తం ఉందని అనుమానం కలుగుతోందని చెబుతున్నారు.
డల్లాస్ మెయిల్స్ వెలుగు చూసి ఇప్పటికి మూడు రోజులవుతున్నా ఇంత వరకూ జగన్ ప్రమేయంపై ప్రభుత్వం ఆధారాలను సంపాదించలేకపోయింది. అయితే, జగనే బాధ్యుడని మాత్రం చెప్పేస్తోంది. ఇప్పటి వరకూ ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోయినా కేవలం అనుమానంతోనే జగన్ పై దేశద్రోహం నేరం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తుండటం గమనార్హం.
ఒకవేళ నిజంగానే ప్రభుత్వం వద్ద ఆధారాలుంటే ఎందుకని బయటపెట్టలేకపోతోందో అర్ధం కావటం లేదు. గతంలో కూడా తునిలో రైలు దహనం ఘటనలోనూ, రాజధాని ప్రాంతంలోని రైతుల పొలాలు తగలబడిన ఘటనలో కూడా చంద్రబాబునాయుడుతో పాటు మంత్రులు జగన్మోహన్ రెడ్డి హస్తముందంటూ ఎన్నో ఆరోపణలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ చివరకి ఏమైంది? పై ఘటనల్లో అసలు జగన్ హస్తమే లేదని తేలిపోయింది.
