రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రం ముసుగు తొలగిపోయింది..

చంద్రబాబునాయుడులో టెన్షన్ మొదలైంది...

మిత్రపక్షాలైన టిడిపి-బిజెపి మధ్య అగ్గి బాగా రాజుకుంది. రాజుకున్న అగ్గివల్ల రెండు పార్టీల మధ్య పొత్తు విచ్చినమయ్యే పరిస్ధితి తలెత్తింది. చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన టిడిఎల్సీ సమావేశంలో ప్రజాప్రతినిధులు బిజెపితో తక్షణమే పొత్తు తెంపుకోమంటూ గట్టిగా చెప్పారు. దాంతో పొత్తు తెంపుకోవటానికి ముహూర్తం ఎప్పుడున్నదే సస్పెన్స్ గా మారింది.

మంగళవారం టిడిఎల్పీ వేదికగా బిజెపి-టిడిపి పొత్తులపై చంద్రబాబు ప్రజాప్రతినిధుల, నేతల అభిప్రాయాలు సేకరించారు. సహజంగానే అందులో నేతలు, ప్రజాప్రతినిధుల్లో ఎక్కువమంది బిజెపితో పొత్తు వద్దనే అన్నారు. చూడబోతే పొత్తు తెంపుకునే విషయంలో బిజెపి జాతీయ నాయకత్వానికి చంద్రబాబు పరోక్షంగా హెచ్చరికలు పంపుతున్నట్లే అనిపిస్తోంది.

ఉదయం నుండి సాయంత్రం వరకూ పొత్తుల విషయంలో ఏమో జరిగిపోతోందని చంద్రబాబు అందరినీ భ్రమల్లో ఉంచారు. ఉదయం నుండి పార్టీ నేతలతో సీరియస్ గా సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అంతమంది అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ‘సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందాం’ అని చెప్పి ఉస్సూరుమనిపించారు.

కేంద్రమేమో చంద్రబాబును ఏమాత్రం లెక్క చేయటం లేదు. చంద్రబాబు ఆగ్రహానికి కేంద్రం దిగివచ్చిందంటూ ఎన్ని లీకులిచ్చి వార్తలు రాయించుకున్నా కేంద్రం ఖాతరు చేయలేదు. పైగా ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వటం సాధ్యం కాదని పార్లమెంటులో ప్రకటించటమే అందుకు నిదర్శనం. అదే సమయంలో ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న రాయితీలేవీ ఏపికి ఇచ్చేది లేదని కూడా చెప్పేసింది.

కేంద్రం చేసిన స్పష్టమైన ప్రకటనతో పొత్తుల విషయంలో నిర్ణయం తీసుకోవటం చద్రబాబు కోర్టులోనే ఉంది. అయితే, ఇప్పటికప్పుడు బిజెపితో పొత్తు తెంపుకునే ధైర్యం చంద్రబాబు చేస్తారా? అన్నదే ప్రశ్న. ఎందుకంటే, ‘ఓటుకునోటు’ కేసు చంద్రబాబు మెడపై వేలాడుతోంది. కేసు విచారణ గనుక సుప్రింకోర్టులో మొదలైతే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవు. అందుకనే టిడిఎల్పీ సమావేశంలో మాట్లాడుతూ, ‘కేసులు పెడితే పెట్టనియ్యండి భయపడేదిలేదు’ అంటూ అసందర్భంగా కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేయటం గమనార్హం.