అభివృద్ధిలో తమిళనాడు అగ్రభాగాన ఎందుకుంది? మన రాష్ట్రం అధోగతిలో ఎందుకుంది అన్నది అర్ధమవటం లేదా?
‘మనవాళ్ళు వాఠ్ఠి వెధవాయిలోయ్’...అని వెనకటికి ఓ పెద్ద మనిషి ఎప్పుడు, ఎందుకన్నాడో? తమిళనాడులో జల్లికట్టు వ్యవహారం చూసిన తర్వాత ఆమాట నిజమేననిపిస్తోంది. ఎందుకంటే, సంప్రదాయ క్రీడ నిర్వహణ విషయంలో తమిళనాడులో రాజకీయ పార్టీలు, ప్రజల ఐకమత్యం ఎలాగుంది? ఆంధ్రాకు ‘ప్రత్యేక’ హామీల సాధన విషయంలో మన రాజకీయ పార్టీలు, ప్రజల స్పందన ఏ విధంగా వుందో తెలియజేస్తుంది.
తమిళనాడులో సంప్రదాయ క్రీడ జల్లికట్టును హైకోర్టు నిషేధించింది. అయితే, హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ పలువురు సుప్రింకోర్టుకు వెళ్ళారు. నిషేధానికి వ్యతిరేకంగా జనాలు కూడా అడ్డం తిరిగారు. దాంతో వివాదం రాజుకుంది. విషయం సుప్రింకోర్టుకు చేరింది. కేసు సుప్రింకోర్టులో ఉండగానే రాష్ట్రం మొత్తం జల్లికట్టును నిర్వహించేసారు. దాంతో పోలీసులు 130 మందిని అరెస్టు చేయటంతో పాటు ఎద్దులను కూడా అదుపులోకి తీసుకున్నారు. దాంతో రాష్ట్రం మొత్తం రెండు రోజులుగా అట్టుడికిపోతోంది.
జనాల ఆగ్రహాన్ని చూసిన రాజకీయపార్టీలు జల్లికట్టు నిర్వహణకు అనుకూలంగా ఏకమైపోయాయి. చివరకు సినీనటులు, కవులు, కళాకారులు, మేధావులు అందరూ జల్లికట్టుకు జిందాబాద్ అంటున్నారు. నిర్వాహకులను అరెస్టు చేయటాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రం మొత్తం నుండి లక్షలాది మంది చెన్నైలోని మెరీనాబీచ్ కు చేరుకుని నిరసన మొదలుపెట్టారు. దాంతో రాష్ట్రంలో పాలన స్ధంబించిపోయింది.
జల్లికట్టు నిర్వహణకు అనుకూలంగా ఆర్డినెన్స్ ఇవ్వాల్సిందేనంటూ ముఖ్యమంత్రి పన్నీర్ శెల్వం గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలువనున్నారు. పాలక ఏఐఏడిఎంకె, ప్రతిపక్ష డిఎంకె కు చెందిన ప్రజాప్రతినిధులు కూడా మోడితో భేటీ అవుతున్నారు. తమిళనాడు దెబ్బకు కేంద్రంతో పాటు సుప్రింకోర్టు కూడా ఇరకాటంలో పడిపోయింది. జల్లికట్టు నిర్వహించటం మంచిదా కాదా అన్నది వేరే సంగతి. రాష్ట్రానికి సంబంధించిన విషయంలో తమిళనాడు ప్రజలు, రాజకీయ పార్టీలు ఏ విధంగా ఏకమవుతాయో గమనించాలి.
ఇక, మన సంగతి చూద్దాం. రాష్ట్ర విభజన సమయంలో ఏపికి ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్, పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించటం లాంటి అనేక హామీలను నాటి యూపిఏ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రకటించింది. రాష్ట్ర విభజన జరిగి రెండున్నరేళ్ళయింది. ఇప్పటి వరకూ ఏమి జరిగింది? ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రత్యేకహోదాను పదేళ్ళు ఇస్తామని భాజపా, కాదు 15 ఏళ్ళు సాధిస్తామంటూ చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో హామీలిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేమిటి? ప్రజలను ఎన్నిసార్లు వెర్రివాళ్ళను చేసాయి.
ఇచ్చిన హామీలను అమలు చేయమని వైసీపీ అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేస్తుంటే ఎంత చులకన చేస్తున్నారో అందరూ చూస్తున్నదే. చివరకు పవన్ కల్యాణ్ను కూడా పట్టించుకోలేదు. రాష్ట్ర భవిష్యత్ దెబ్బతింటుందని తెలిసినా ప్రజలెవరూ పట్టించుకోలేదు. దాంతో ఆందోళన చేసిన ప్రతిపక్షాల్లో కూడా నీరసం వచ్చేసింది. ఇపుడు చెప్పండి తమిళనాడుతో మన ప్రజలను పోల్చి చూసుకుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? అభివృద్ధిలో తమిళనాడు అగ్రభాగాన ఎందుకుంది? మన రాష్ట్రం అధోగతిలో ఎందుకుంది అన్నది అర్ధమవటం లేదా? ఒకవేళ చంద్రబాబు గనుక ప్రతిపక్షంలో ఉండి వుంటే ‘ప్రత్యేక’ హామీల అమలుకు ఈపాటికి ఎంత రచ్చ చేస్తూండేవారో...
